సండే నో హాలిడే

17 Oct, 2016 13:27 IST|Sakshi

వర్క్.. వర్క్.. మండే మార్నింగ్ నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ బిజీ బిజీగా గడిపే జనమంతా, వీకెండ్స్ వచ్చేసరికి సినిమాకో.. పార్టీకో.. వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. మరి, సినిమా తారల సంగతేంటి? వాళ్లది 9 టు 6 జాబ్ కాదుగా. సండే.. మండే.. వీకెండ్స్ అనే తేడా ఉండదు. షెడ్యూల్‌ను బట్టి షూటింగ్ చేయక తప్పదు. స్టార్స్ నుంచి స్మాల్ ఆర్టిస్టుల వరకూ వీకెండ్స్‌లో షూటింగ్ ఉంటే చేస్తారు. ఈ వారాంతంలో చిరంజీవి, మహేశ్‌బాబు, అక్షయ్‌కుమార్ వంటి హీరోలతో పాటు శ్రుతీహాసన్ టు తాప్సీ... చాలామంది తారలు మేకప్ వేసుకున్నారు. ‘సండే నో హాలిడే... అయినా ఓకే’ అంటూ హ్యాపీగా షూటింగ్‌లకు హాజరయ్యారు.

చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. రాఘవా లారెన్స్ నృత్య దర్శకత్వంలో చిరు, రాయ్ లక్ష్మీలపై ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవియేమో స్టూడియోలో స్టెప్పులేస్తుంటే.. మహేశ్‌బాబు హైదరాబాద్ రోడ్స్‌పై ఫైట్ చేస్తున్నారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్, యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటిస్తున్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమా షూటింగ్ కూడా అన్నపూర్ణలోనే జరుగుతోంది.

 హైదరాబాద్‌లో శ్రుతీహాసన్ ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా ఉంటే.. మలేసియాలో ‘నామ్ షబానా’ అంటున్నారు తాప్సీ. ‘బేబి’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న ‘నామ్ షబానా’ షూటింగ్‌తో ఆమె బిజీ. ఇందులో తాప్సీది మెయిన్ రోల్. అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. శింబూతో కలసి చెన్నైలో జరుగుతోన్న ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు తమన్నా. ఇంకా పలువురు తారలు ఈ వీకెండ్ షూటింగులతోనే గడిపారు.