మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఉంటా

13 Nov, 2019 03:11 IST|Sakshi

‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా తర్వాత నేను కామెడీ ఫిల్మ్‌ చేయలేదు. చాలా విరామం తర్వాత ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రంలో పూర్తి స్థాయి వినోదాత్మక పాత్ర చేశా. నాకు వినోదం అంటే చాలా ఇష్టం. అందుకే బాగా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా చేశా. ప్రేక్షకులు రెండు గంటల ఎనిమిది నిమిషాలు పడి పడి నవ్వుతారు’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు.

సందీప్‌ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మీడియాతో పంచుకున్న విశేషాలు.


►నా కెరీర్‌లో తొలిసారి ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సినిమాలో లాయర్‌ పాత్ర చేశా. కర్నూల్‌ టౌన్‌లో ఈ కథ సాగుతుంది. కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పట్టుకుని కోర్టు బయట రాజీ చేయిస్తుంటా. అలాంటిది ఓ పెద్ద కేసుతో అనుకోని ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎలా పరిష్కరించానన్నది ఆసక్తిగా ఉంటుంది. నా పాత్ర చాలా సరదాగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. సింపుల్, స్వీట్‌ స్టోరీ ఇది. థ్రిల్‌ కలిగించే అంశాలూ ఉంటాయి.

►నాగేశ్వర రెడ్డిగారు అంటేనే వినోదం. ఈ టైమ్‌లో ఆయనలాంటి డైరెక్టర్‌ నాకు కుదరడం నేను సూపర్‌ లక్కీ. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. కథలో కామెడీ ఉండాలి కానీ, కామెడీ కోసం కథ ఉండకూడదు. మా సినిమా మొదటి కోవలోకి వస్తుంది.

►ప్రేక్షకులు నన్ను ఓ జానర్‌లో ఆదరించినప్పుడు వెంటనే మరో జానర్‌కి వెళ్లడంతో కొన్ని పరాజయాలు వచ్చాయి. అందుకే ప్రస్తుతం చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నా. మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఇంట్లో అయినా ఉంటాను కానీ, ఫ్లాప్‌ అయ్యే సినిమాలు మాత్రం చేయకూడదని నిర్ణయించుకున్నా. ‘నక్షత్రం’ సినిమా పరాజయం నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టింది (నవ్వుతూ).

►హిందీలో ‘ది ఫ్యామిలీ మేన్‌’ అనే వెబ్‌ సిరీస్‌ తొలి భాగంలో మేజర్‌ విక్రమ్‌ పాత్రలో నటించా. చాలా మంచి స్పందన వచ్చింది. రెండో భాగంలో నేను ఉండను.. మూడో భాగంలో ఉంటా. తెలుగులోనూ గతంలో కంటే ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లు బాగా వస్తుండటం చాలా సంతోషంగా ఉంది.

►ఓ సినిమా చేస్తున్నప్పుడే మూడు నాలుగు కథలు లాక్‌ చేసి పెట్టుకోవాలనుకోను. ఓ సినిమా విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం నా దృష్టంతా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ సినిమాపైనే ఉంది. దీని తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ఒప్పుకున్నా. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్‌ పాత్ర చేస్తున్నా.

నా ప్రొడక్షన్‌లో రాహుల్‌ రామకృష్ణ–ప్రియదర్శిలతో ఓ సినిమా నిర్మించనున్నా. ‘ది ఫ్యామిలీ మేన్‌’ తర్వాత బాలీవుడ్‌లో వెబ్‌ సిరీస్‌లకు, సినిమాలకు అవకాశాలొచ్చాయి. అయితే ప్రస్తుతం నా దృష్టి తెలుగు చిత్రాలపైనే.  తమిళంలో నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అవి విడుదలయ్యాకే వేరే తమిళ సినిమాల గురించి ఆలోచిస్తా.

మరిన్ని వార్తలు