ప్రియాంక దుస్తుల దుమారంపై సన్నీ

3 Jun, 2017 09:28 IST|Sakshi
ప్రియాంక దుస్తుల దుమారంపై సన్నీ

ముంబై: జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా  కలుసుకున్న సందర్భంగా చెలరేగిన వివాదంపై   నటి సన్నీ లియోన్‌ స్పందించారు.  బెర్లిన్‌లో మోదీతో జరిగిన భేటీలో ప్రియాంక దుస్తులపై దుమారం, సభ్యతను, సంప్రదాయాలను కించపరిచేలా దుస్తులు ధరించిందంటూ  వ్యక్తమైన అభిప్రాయాలపై ఆమె స్పందించారు.  ఏ దుస్తులు ధరించాలి అనేది  ప్రియాంక యిష్టమని, వేసుకున్న దుస్తులను కాకుండా, వారి చర్యలను చూడాలని  కోరారు. మనం ఒకర్నొకరు ప్రేమించుకోవాలి తప్ప ద్వేషించు కోకూడదని చెప్పారు.

ప్రియాంక లాంటి వ్యక్తులను ధరించిన దుస్తుల ఆధారంగా కాకుండా..వారి వ్యక్తిత్వాన్ని చూడాలంటూ  ప్రియాంకకు మద్దుతుగా నిలిచారు.  ప్రియాంకకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయని, సమాజానికి ఎంత సేవ చేస్తున్నారో తనకు తెలుసుననీ  చెప్పారు.  

ముంబైలో పెటా ఆధ్వర్యంలో గో వెజిటేరియన్‌  క్యాంపెయిన్‌ సందర్భంగా సన్నిలియోన్ మాట్లాడుతూ.. అత్యంత హుందాతనం ఉన్న వ్యక్తిని భారత ప్రధానిగా ఎన్నుకొన్నాం. ఆయన ఏ విషయంపైనైనా నిక్కచ్చిగా మాట్లాడుతారు. కుండ బద్దలు కొట్టినట్టు చెపుతారు. ప్రియాంక వ్యవహారంలో ఆయనకు ఏదైనా సమస్య ఉంటే ఆమెకు నేరుగా చెప్తారు.. కానీ  ప్రధాని అలా చేయలేదనీ సన్నీ వ్యాఖ్యానించారు.

 అటు ఈ వ్యవహారంపై కమెంట్‌ చేయడానికి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌   కూడా సుతిమెత్తగా తిరస్కరించారు.  దీనిపై స్పందించడానికి తాను  ప్రధాని కాననీ, అలాగనీ ప్రియాంక చోప్రాను కూడా కాదంటూ  ఈ అంశానికి తనకు ఎలాంటి  సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాగా ప్రధాని నరేంద్రమోదీతో జర్మనీలో కలుసుకున్నప్పటి ఒక ఫోటోను సోషల్‌ మీడియాలో  ప్రియాంక   చోప్రా షేర్‌  చేయడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు.   దీంతో తన దుస్తులపై  నెటిజన్లు ఆగ్రహంపై ప్రియాంక  ఘాటుగానే స్పందించారు. తన తల్లి వద్ద కూడా తాను అలానే ఉంటానంటూ తల్లి మధు చోప్రాతో కలిసి ఉన్న ఫోటోను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. అలాగే బాలీవుడ్‌ నటులు  వరుణ్ ధావన్‌ తదితరులు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే.