కాలాలో అతిథిగా... మరో సూపర్‌స్టార్‌

3 Jun, 2017 09:34 IST|Sakshi
కాలాలో అతిథిగా... మరో సూపర్‌స్టార్‌

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న కాలా చిత్రం గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు బయట హల్‌చల్‌ చేస్తున్నాయి. రజనీకాంత్‌ తన అల్లుడు ధనుష్‌ చిత్ర నిర్మాణ సంస్థ వండర్‌ బాల్‌ ఫిలింస్‌లో నటిస్తున్న తొలి చిత్రం కాలా. అదే విధంగా కబాలి తరువాత పా. రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న రెండవ చిత్రం ఇది. హ్యును ఖురేషి నాయకిగా నటిస్తున్న ఇందులో అంజలి పటేల్, సాక్షి అగర్వాల్‌ అదనపు ఆకర్షణగా నిలువనున్నారు. బాషా, కబాలి చిత్రాల తరువాత రజనీకాంత్‌ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న చిత్రం కాలా. ఈ చిత్ర పరిచయ పోస్టర్‌ రజనీకాంత్‌ మహేంద్ర జీపులో కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న దృశ్యం ఆయన అభిమానులను విపరీతంగా అలరించింది.

జీప్‌ ముందు భాగంలో బీఆర్‌ 1956 అనే నంబరు ప్లేట్‌ ఉంటుంది. అది బీఆర్‌ అంటే అంబేడ్కర్‌ అని, 1956 అంటే ఆయన మరణించిన సంవత్సరం అని అర్థం అని తెలిసింది. వీటిని ఒక కారణంతోనే వేసినట్లు కాలా చిత్రంలో అంబేడ్కర్‌ పాత్ర చోటు చేసుకుంటుందని సమాచారం. కాగా ఆ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టిని నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. మలయాళంలో మమ్ముట్టి నటించిన కమ్మత్‌ అండ్‌ కమ్మత్‌ చిత్రంలో నటుడు ధనుష్‌ అతిథి పాత్రలో నటించారు. అదే విధంగా తన కాలా చిత్రంలో మమ్ముట్టి అతిథిగా నటిస్తారనే నమ్మకంతో ఆయన్ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజం అయితే 26 ఏళ్ల క్రితం దళపతి చిత్రంలో కలిసి నటించిన రజనీకాంత్, మమ్ముట్టి మళ్లీ కాలాతో అభిమానులను మరోసారి అలరించబోతారన్నమాట.