రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

2 Nov, 2019 13:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 ఉత్సవంలో ఆయనను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. అలాగే విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ మరో విశేష అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆమెను వరించింది. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో  రజనీకాంత్‌ను సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విటర్ ద్వారా  శనివారం అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఇసాబెల్లెకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన రజనీకాంత్‌ ప్రతిష్టాత్మక గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో మహిళా దర్శకుల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు.  వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. వీటిలో 24 చిత్రాలు ఆస్కార్ నామినేషన్ల రేసులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు