తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం

4 Jan, 2020 00:11 IST|Sakshi

 – రజనీకాంత్‌

‘‘1976లో తెలుగులో నా ‘అంతులేని కథ’ సినిమా విడుదలైంది.. ఇçక్కడున్న వారిలో 99శాతం మంది అప్పుడు పుట్టి ఉండరు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు రజనీకాంత్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘దర్బార్‌’. ఎ. సుభాస్కరన్‌ నిర్మించిన  ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న ‘దర్బార్‌’ విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రజనీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఎన్వీ ప్రసాద్‌గారు నాకు 20ఏళ్లుగా తెలుసు.. సినిమా ఆడినా, ఆడకున్నా ఒకేలా ఉంటారాయన.

మామూలుగా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్‌ను ఆయన కొంచెం లో ప్రొఫైల్‌లో చేసేవారు. కానీ ‘దర్బార్‌’ సినిమా హిట్‌ అని తెలిసిపోయినట్టుంది ఆయనకు.. అందుకే ఇంత భారీ వేడుక ప్లాన్‌ చేశారు. నా వయసు 70 ఏళ్లు.. ఇంకా నేను హీరోగా నటిస్తున్నానంటే ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహమే కారణం.. అవే నా ఎనర్జీ. ఈ వయసులోనూ మీరు ఇంత సంతోషంగా, ఉత్సాహంగా ఎలా ఉన్నారని కొందరు అడుగుతారు.. నేను వారికి చెప్పేది ఒక్కటే. తక్కువగా ఆశ పడండి.. తక్కువ ఆలోచనలు పెట్టుకోండి.. తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి.. తక్కువగా వ్యాయామాలు చేయండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు.

‘పెదరాయుడు, బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ వంటి సినిమాలు రజనీ ఉన్నాడని బాగా ఆడలేదు.. ఆ సినిమాలు బాగున్నాయి.. వాటిల్లో రజనీ ఉన్నాడంతే. అందరూ సక్సెస్‌ఫుల్‌ సినిమా తీయాలి, బాగా ఆడాలని తీస్తారు. సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్‌ జరుగుతుంది, ఆ సినిమా బాగా వస్తుంది. అయితే అది మన చేతుల్లో ఉండదు. ‘దర్బార్‌’ చేసేటప్పుడు ఆ మ్యాజిక్‌ మాకు తెలిసిపోయింది. మురుగదాస్‌గారితో పని చేయాలని 15ఏళ్లుగా చూశాను కానీ కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. సుభాస్కరన్‌గారు పెద్ద వ్యాపారవేత్త. సినిమాలంటే ఇష్టంతో తీస్తున్నారు.. ఇప్పుడు మన ‘బాహుబలి’లాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే ప్యాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ తీస్తున్నారు’’ అన్నారు.  

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్‌ చివరలో రజనీసార్‌ నడుచుకుంటూ వచ్చే షాట్‌కి నేను ఫిదా అయిపోయా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇరగదీస్తున్న మురుగదాస్‌గారికి సెల్యూట్‌. రజనీ సార్‌ ‘జీవన పోరాటం’ సినిమా టైమ్‌లో నేను పిల్లాణ్ణి.. ఆ సినిమాలో ఆయన స్టైల్‌ చూసి, అలా చేయాలని ప్రయత్నించా. కానీ, రాలేదు’’ అన్నారు.

మురుగదాస్‌ మాట్లాడుతూ–‘‘నా కెరీర్‌లో ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే రజనీగారితో నేను చేసిన తొలి మూవీ. అలాగే నేను తీసిన తొలి పోలీస్‌ స్టోరీ. పదిహేనేళ్ల క్రితం రజనీగారిని ప్రేక్షకులు ఎలా చూశారో ఆ స్టైల్, ఆ మాస్‌ అంశాలన్నీ ‘దర్బార్‌’లో ఉన్నాయి. ఇలాంటి ప్యాన్‌ ఇండియన్‌ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్‌ సార్‌కి ధన్యవాదాలు. సుభాస్కరన్‌గారు నిజమైన హీరో. భవిష్యత్‌లో ఆయన లైఫ్‌ స్టోరీ ఒక బయోపిక్‌గా రావొచ్చు. అంత మంచి లైఫ్‌ స్టోరీ ఆయనది. రజనీగారికి ప్రత్యర్థిగా ఉండే బలమైన పాత్రని సునీల్‌శెట్టిగారు బ్యాలెన్స్‌ చేశారు’’ అన్నారు.
నివేదా థామస్‌ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాలో ఈ పాత్రకి నేను సరిపోతానని అవకాశం ఇచ్చిన మురుగదాస్‌గారికి చాలా థ్యాంక్స్‌. షూటింగ్‌లో రజనీ సార్‌ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నటిస్తున్నారని చూస్తూనే ఉండేదాన్ని. విజయ్, అజిత్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాని.. ఇలా అందర్నీ మనం అభిమానిస్తాం. వాళ్లందరికీ కామన్‌గా నచ్చే ఒక యాక్టర్‌ రజనీ సార్‌’’ అన్నారు. 
 
పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘2.ఓ’కి ఓ పాట, ‘పేట’కి ఓ పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘దర్బార్‌’లో రెండు పాటలు రాశా’’ అన్నారు.

సంగీత దర్శకుడు అనిరుద్‌ మాట్లాడుతూ–‘‘ఈ  సినిమా నాకు ప్రత్యేకం.. ఎందుకంటే  నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన రజనీసార్‌కి, తన కలల చిత్రంలో చాన్స్‌ ఇచ్చిన మురుగదాస్‌కి  థ్యాంక్స్‌’’ అన్నారు.

‘‘రజనీగారిని అందరూ సూపర్‌స్టార్‌ అని పిలుస్తారు. కానీ, నా వరకు ఆయన గాడ్‌ ఆఫ్‌ సినిమా. ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సెట్‌లో మురుగదాస్‌గారు మా అందరికీ గురువు’’ అన్నారు బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి. ‘‘రజనీకాంత్‌గారితో తొలిసారి ‘దళపతి’ సినిమాకు చేశాను. ఆయన ఎనర్జీలో మార్పు లేదు’’ అన్నారు కెమెరామేన్‌ సంతోష్‌ శివన్‌.  ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, కేకే రాధామోహన్, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్, మారుతి, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్, పాటల రచయిత కృష్ణకాంత్, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు