‘తిక్క’పై మొదట్నుంచీ నమ్మకం ఉంది

13 Aug, 2016 00:50 IST|Sakshi
‘తిక్క’పై మొదట్నుంచీ నమ్మకం ఉంది

 ఒకొక్క సినిమాతో తన స్థాయిని పెంచుకొంటున్నాడు సాయిధరమ్ తేజ్. ప్రతి సినిమాతోనూ తన ప్రతిభని పూర్తి స్థాయిలో బయటపెడుతున్నాడు. ఆ ప్రయత్నమే ఆయన్ని సుప్రీమ్ హీరోని చేసింది. యువతరంలో వేగంగా మాస్ ఇమేజ్‌ని సంపాదించుకొన్న కథానాయకుడిగా సాయిధరమ్ తేజ్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చు కొన్నాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ చిత్రాలతో విజయాల్ని అందు కొన్న తేజ్ శనివారం ‘తిక్క’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌పై సి.రోహిన్ రెడ్డి నిర్మాతగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాయిధరమ్ తేజ్ ‘సాక్షి’తో చెప్పిన ప్రత్యేకమైన విషయాలు.  
 
సినిమా ఎంత బాగా వచ్చినా రిలీజ్‌కి ముందు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఈ సినిమాకీ అంతే. కానీ నేను చేసిన అన్ని సినిమాలకంటే ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఎందుకో తెలీదు కానీ...  మొదట్నుంచీ ఈ కథ నాకు నమ్మకంగా అనిపించేది. నేనే కాదు, నిర్మాత, దర్శకుడు, టీమ్... ఇలా ప్రతి ఒక్కరూ వంద శాతం కాన్ఫిడెన్స్‌తో చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.
 
అమ్మాయితో బ్రేకప్ అయ్యాక ఓ అబ్బాయి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొంటాడు. ఆ హ్యాంగోవర్‌లో జరిగే కథే ఇది. తాగిన మైకంలో కొన్ని తిక్క పనులు చేసేస్తాడు. దానివల్ల ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. కథకు తగ్గట్టుగానే ఈ పేరు కుదిరింది. నెగిటీవ్ టైటిల్ అనే ఫీలింగ్ వచ్చింది.. కానీ, ఈ సినిమాకి ఇదే కరెక్ట్ టైటిల్. కాకపోతే ఇంట్లోవాళ్లు, స్నేహితులు తిక్క హీరో అని ఏడిపిస్తున్నారు. ఈ సినిమా హ్యాంగోవర్‌లో జరిగే కథే అయినా.. మద్యపానం వల్ల జరిగే అనర్థాల్ని కూడా చూపిస్తున్నాం.

ఒక కథని ఎలా తెరకెక్కించాలనుకొన్నామో అలాగే చేశాం. నిర్మాత, దర్శకుడు, హీరోగా నేను, టెక్నీషియన్ గా మా టీమ్.. ఎవ్వరూ ఏ విషయంలోనూ రాజీపడలేదు. అందుకే ఓ క్వాలిటీ సినిమా బయటికొచ్చింది. ఈ సినిమాకి బడ్జెట్ బాగా ఎక్కువైపోయిందని బయట టాక్. కానీ అదేం లేదు. నా మార్కెట్‌కి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు నిర్మాత. దర్శక-నిర్మాతలిద్దరూ నాకు సోదరులతో సమానం. అన్నా... అన్నా అని పిలుస్తుంటా. వాళ్లతో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియన్. నేనేం చేయగలనో ఈ సినిమా కోసం అన్నీ చేయించాడు దర్శకుడు.
 
  కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. ప్రేక్షకులు నా మీద నమ్మకంతో థియేటర్లకి వస్తున్నారు. అంతకంటే ఏం కావాలి? నిజానికి ప్రేక్షకులు నన్ను ఇంత త్వరగా రిసీవ్ చేసుకొంటారని అనుకోలేదు. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ప్రేక్షకులు నాపై ఉంచుతున్న నమ్మకాన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నా. ఇకపై మరింతగా కష్టపడతా. మావయ్యలు కూడా అదే చెబుతుంటారు.  ప్రేక్షకుల నమ్మకాన్ని ఏ దశలోనూ వమ్ము చేయకూడదని, కథల ఎంపికలోగానీ, నటనలోగానీ మన ఎఫర్ట్ వంద శాతం కనిపించాలని చెబుతుంటారు. ఆ మాటల్ని ఎప్పటికీ మరిచిపోను.

నేను కథానాయకుడు అవడానికన్నా ముందు ఓ ప్రేక్షకుడిని అనే విషయాన్ని మరచిపోను. అందుకే కథల ఎంపికలో ఒత్తిడికి గురి కాకుండా ఒక ప్రేక్షకుడిగా నాకు ఎలాంటి కథలు నప్పుతాయో అలాంటి కథల్నే ఎంపిక చేసుకొంటా. ప్రేక్షకులకు కావల్సినవన్నీ కథలో ఉన్నాయి అనుకుంటే తప్పకుండా చేస్తాను.