ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

23 May, 2019 02:01 IST|Sakshi
సురేశ్‌ కొండేటి

‘‘సినిమాకు చెందిన 24 క్రాఫ్ట్స్‌తో లింక్‌ ఉన్న ఏ పని చేయడానికైనా నేను సిద్ధమే. ఎందుకంటే సినిమా తప్ప నాకు వేరే తెలీదు’’ అన్నారు సురేశ్‌ కొండేటి. అంజలి ప్రధాన పాత్రలో రాజు విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లీసా’. ఈ చిత్రాన్ని సురేశ్‌ కొండేటి తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘లీసా’ రేపు విడుదల కానున్న సందర్భంగా సురేశ్‌ కొండేటి చెప్పిన విశేషాలు.

► తొలిసారి 1985లో ‘చిన్నారి చేతన’ అనే త్రీడీ ఫిల్మ్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను. ఇప్పుడు హారర్‌ 3డీ ఫిల్మ్‌ ‘లీసా’ను విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ‘ప్రేమిస్తే’ సినిమాతో నిర్మాతగా మారాను. ‘లీసా’ నా 15వ సినిమా. ఈ చిత్రాన్ని నేను విడుదల చేస్తున్నానని తెలిసిన నాలుగు గంటల్లోనే ఆరు జిల్లాల రైట్స్‌ అమ్ముడుపోయాయి. నెక్ట్స్‌ డే సినిమా రైట్స్‌ అన్నీ అమ్ముడుపోయాయి.

► ‘లీసా’ కేవలం హారర్‌ కామెడీనే కాదు. ఈ సినిమాలో మంచి సెంటిమెంట్‌ కూడా ఉంది. సినిమా చూసి ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు. దాదాపు 400 వందల థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ‘2.ఓ’, ‘అవెంజర్స్‌’ సినిమాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని 3డి థియేటర్స్‌ ఏర్పడ్డాయి. 2డీలో చూసినా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది.

► పాత్రికేయుడిగా నా కెరీర్‌ని  స్టార్ట్‌ చేశాను. ‘సంతోషం’ పత్రిక సక్సెస్‌ఫుల్‌గా 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌’ మెంబర్‌గా, జర్నలిస్టుగా, నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నందుకు హ్యాపీగా ఉంది. నాకు చిరంజీవిగారే స్ఫూర్తి. ఓ సందర్భంలో ‘సురేశ్‌ నువ్వు నిర్మాత అవుతావు’ అన్నారు చిరంజీవిగారు. అయ్యాను. 2004లో అనుకుంటా.. ‘రేపు నాతో కూడా సినిమా చేస్తాడేమో’ అన్నారు. ఆ మాట నాకు బ్లెస్సింగే.  ప్రస్తుతం ‘షకలక’ శంకర్‌తో ‘శ్రీకాకుళం: ఎనీటైమ్‌ రెడీ’ అనే సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ‘ఎర్రచీర’ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాను.

>
మరిన్ని వార్తలు