సూర్య చిత్రానికి అడ్డంకులు

27 Aug, 2019 10:31 IST|Sakshi

నటుడు సూర్య చిత్రానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోలీవుడ్‌లో కథలు కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే విజయ్‌ నటించిన బిగిల్‌ చిత్ర కథ తనదంటూ ఒక వ్యక్తి కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కాప్పాన్‌ చిత్రం కథా అపహరణ ఆరోపణలను ఎదుర్కొంటోంది. కాప్పాన్‌ చిత్ర కథ తనదంటూ ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. వివరాలు.. సూర్య, సయోసా సైగల్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం కాప్పాన్‌.

నటుడు ఆర్య, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. కాగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రోంపేటకు చెందిన జాన్‌ సార్లెస్‌ అనే వ్యక్తి కాప్పాన్‌ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు.

అందులో తాను 10 ఏళ్లుగా సినిమారంగంలో పని చేస్తున్నానని పేర్కొన్నాడు. పలు కథలను రాశానని తెలిపాడు. తాను సరవెడి పేరుతో రాసిక కథలో పాత్రికేయుడైన హీరో ప్రధానమంత్రిని ఇంటర్యూ చేస్తాడన్నారు. ఆ సందర్బంగా నదుల అనుసంధానం, నీటి పంపకాలు, వ్యవసాయం సంక్షేమం గురించి ప్రశ్నిస్తాడన్నాడు. ఈ కథను దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌కు వినిపించానని తెలిపాడు. అదే విధంగా దర్శకుడు కేవీ.ఆనంద్‌కు తన కథను చెప్పాననీ, ఆయన క్షణంగా విన్నారనీ చెప్పాడు. తనకు అవకాశం కల్సిస్తానని మాట కూడా ఇచ్చారని అన్నాడు.

అలాంటి సమయంలో తన సరవేడి కథను కాప్పాన్‌ పేరుతో సూర్య హీరోగా కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న సంగతి  తెలిసి దిగ్భ్రాంతికి గురైయ్యానన్నాడు. తన కథలోని సన్నివేశాలే చోటు చేసుకున్నాయని తెలిపాడు. కాబట్టి కాప్పాన్‌ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరాడు. ఈ విచారణ సోమవారం న్యాయమూర్తి కృష్ణన్‌రామసామి సమక్షంలో వచ్చింది. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు