రేసీ.. మాసీ సింగమ్‌

10 Feb, 2017 23:16 IST|Sakshi
రేసీ.. మాసీ సింగమ్‌

సింగమ్‌... ఓ సినిమా పేరు కాదు, అదో బ్రాండ్‌. అందులో సూర్య యాక్షన్, డైలాగ్‌ డిక్షన్, మీసకట్టు.. ప్రతిదీ బ్రాండ్‌. ‘సింగమ్‌’ బ్రాండ్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ రెండుసార్లు షేక్‌ అయింది. ముచ్చటగా మూడోసారి నరసింహం అలియాస్‌ ‘సింగమ్‌’గా ఈ నెల 9న తమిళ హీరో సూర్య ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో లుక్కేయండి!

కథేంటి?: మంగుళూరు సిటీ పోలీస్‌ కమీషనర్‌ (జయప్రకాశ్‌) హత్యకు గురవుతాడు. నెలలు గడుస్తున్నా హంతకుల్ని పట్టుకోలేకపోయారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆందోళనలతో కర్ణాటక అసెంబ్లీ అట్టుడుకు తుంది. అప్పుడు సౌతాఫ్రికన్‌ మాఫియా డాన్‌ డానీ ఆట కట్టించిన (సింగం–2లో) ఏపీ పోలీస్‌ నరసింహం (సూర్య) ని డిప్యూటేషన్‌పై సీబీఐ అధికారిగా మంగుళూరుకు రప్పిస్తారు కర్ణాటక హోంమంత్రి (శరత్‌బాబు). నరసింహంకి కమీషనర్‌ హత్య కేసు అప్పగిస్తారు. నిజాయితీకి మారుపేరు గా ముద్రపడిన నరసింహం... మంగుళూరుకి వచ్చిన వెంటనే రౌడీలతో స్నేహం చేస్తాడు.

ఈ క్రమంలో కేంద్రమంత్రి కుమారుడు, ఆస్ట్రేలియాలో నివాసం ఉండే ఆ దేశ పౌరుడైన విఠల్‌ప్రసాద్‌ (అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌) సిటీలో చేస్తున్న పలు అక్రమాలు నరసింహంకి తెలుస్తాయి. సాక్ష్యాలు చేతికి చిక్కిన తర్వాత విఠల్‌ అక్రమాలు వెలుగు లోకి తీసుకురావాలనుకున్న టైమ్‌లో నరసింహంకి షాక్‌. ‘రౌడీలతో నరసింహం స్నేహం’ పేరుతో పతాక శీర్షికల్లో వార్తలొస్తాయి. ఈ వార్త రాసింది... సిటీకి వచ్చినప్పట్నుంచీ నరసింహం వెంటపడిన విద్య అలియాస్‌ అగ్ని (శ్రుతీహాసన్‌) అనే అమ్మాయి. ఈ వార్తల్ని సాకుగా చూపి, సీబీఐ అతణ్ణి విధుల నుంచి తప్పుకోమంటుంది. అప్పుడు నరసింహం ఏం చేశాడు? కావ్య (అనుష్క)తో పెళ్లైన తర్వాత విడాకులు తీసుకున్నానని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆస్ట్రేలియాలో నివసించే విఠల్‌ అక్రమాలను ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? తనపై ప్రజలు, ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది కథ.

విశ్లేషణ: సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే మూడడుగులు ముందుకు దూకడానికే, జూలు విదల్చడానికే అన్న సామెతను దర్శకుడు హరి బాగా వంటబట్టించుకున్నారు. సిన్మా ప్రారంభంలో కాస్త వెనకడుగు వేసిన నరసింహం.. జూలు విదిల్చిన దగ్గర్నుంచీ కథ వంద కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ‘సింగమ్‌’ ఫ్రాంచైజీలో వచ్చిన గత సిన్మాల కంటే స్క్రీన్‌ప్లే ఇందులో మరింత ఫాస్ట్‌గా ఉంటుంది. హరి మార్క్‌ యాక్షన్‌ సీన్లు, డైరెక్షన్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. మాస్‌... అంటే సింగమ్‌. సింగమ్‌... అంటే మాస్‌ అనే రీతిలో ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్‌ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి.

ఇంత మాస్‌ యాక్షన్‌ సిన్మాలోనూ దర్శకుడు హరి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చూపించిన తీరు బాగుంది. అనుష్క, శ్రుతీహాసన్‌ పాత్రలు కథతో పాటు ప్రయాణం చేశాయి. నరసింహం పాత్రలో సూర్య ఉగ్ర నరసింహుడిగా చెలరేగారు. పంచ్‌ డైలాగులు, యాక్షన్‌ సీన్లలో కసి, కథకు అవసరమైన చోట ఎమోషనల్‌ యాక్టింగ్‌తో ఇరగదీశారు. సంగీత దర్శకుడు హ్యారీస్‌ జయరాజ్‌ కూడా సీన్‌కి తగ్గట్టు తన సై్టల్‌లో కాకుండా మాసీగా రీ–రికార్డింగ్‌ చేశారు. పక్కా మాస్‌ మసాలా యాక్షన్‌ ఫిల్మ్‌ ఇది.

>