సూర్య వ్యాఖ్యలపై దుమారం

17 Jul, 2019 08:00 IST|Sakshi

చెన్నై ,పెరంబూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యావిధానంపై నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండిస్తుండగా, మరి కొందరు స్వాగతిస్తుండటం విశేషం. ఇంతకీ నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఇటీవల శివకుమార్‌ విద్యా ట్రస్టు, సూర్య అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొందిన 10వ తరగతి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా అమల్లోకి తీసుకురానున్న విద్యావిధానంపై çఘాటుగా విమర్శించారు. నీట్‌ పరీక్షల విధానాన్ని ఖండించారు.

బీజేపీ నేతల ఖండన
నటుడు సూర్య వ్యాఖ్యలపై రాజకీయ నాయకుల్లో విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, ఆయన సన్నిహితులు మాత్రం సూర్య వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు.

హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయి
సూర్య వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖిండిస్తున్నామన్నారు. సూర్య వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని అన్నారు.

తెలియని వారు కూడా మాట్లాడుతున్నారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ మీడియాతో మాట్లాడుతూ అందరికీ విద్యను అందించాలని, అదీ సమతుల్యమైన విద్యగా ఉండాలనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని  తీసుకొస్తోందన్నారు. అయినా తమిళనాడులో ఆ విధానాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. మరో విషయం ఏమిటంటే విద్యా విధానం గురించి తెలియనివారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారని సూర్యపై ధ్వజమెత్తారు.

సూర్యకేం తెలుసు?
రాష్ట్ర మంత్రి కడంబూరు రాజును నటుడు సూర్య వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రశ్నించగా విద్యావిధానంపై నటుడు సూర్యకు ఏం తెలుసని అన్నారు. ఏదీ పూర్తిగా తెలియకుండా అరకొరగా మాట్లాడేవారి కంటే పూర్తిగా తెలిసిన వారికైతే బదులివ్వవచ్చునన్నారు. నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్‌ మాట్లాడుతూ నటుడు సూర్య వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. ఏ విషయం గురించి అయినా మాట్లాడే స్వేచ్ఛ సూర్యకు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్య విధానంపై పెద్ద పెద్ద నటులే మాట్లాడటానికి భయపడుతుంటే నటుడు సూర్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీమాన్‌ పేర్కొన్నారు. ఇక సూర్య అనుకూల వర్గం ఆయన వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధిస్తున్నారు. సూర్య తన అగరం ఫౌండేషన్‌ ద్వారా ఎందరో పేద విద్యార్థులను చదివిస్తున్నారని, ఆయనకు విద్యపై అవగాహన ఉందని అంటున్నారు. నటి జ్యోతిక కూడా ఇటీవల అలాంటి వ్యాఖ్యలనే చేశారని గుర్తు చేశారు. కాగా సూర్యకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆయనకు అలాంటి ఆలోచన లేదని అన్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంపై సూర్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 

మరిన్ని వార్తలు