మూవీ రివ్యూ: సూర్య ‘గ్యాంగ్‌’

12 Jan, 2018 23:17 IST|Sakshi

నటీనటులు : సూర్య, కీర్తి సురేశ్‌, రమ్యకృష్ణ , కార్తీక్‌
జానర్‌ : యాక్షన్‌, డ్రామా, వినోదం
దర్శకుడు : విఘ్నేశ్‌ శివన్‌
సంగీతం : అనిరుధ్‌
నిర్మాత : కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా

సూర్య హీరోగా, యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంయుక్తంగా నిర్మించిన ‘గ్యాంగ్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడులైంది. మొదటిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. తమిళ హీరో అయిన సూర్యకి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. తన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్‌ అవుతుంటాయి. మరి సూర్య గత సినిమాల్లాగే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు చేరువైందో లేదో తెలుసుకుందాం..

కథ :
సీబీఐ ఆఫీస్‌లో ఓ గుమాస్తాగా పనిచేసే వ్యక్తి కొడుకు తిలక్‌ (సూర్య).. చిన్నప్పటినుంచి అతను కూడా సీబీఐ ఆఫీసర్‌ కావాలనుకుంటాడు. అయితే అక్కడ ఉత్తమ్‌దాస్‌ అనే అధికారి అవినీతికి పాల్పడతాడు. ఆ విషయాన్ని సూర్య తండ్రి పై అధికారులకు చెబుతాడు. దీంతో పగబట్టిన ఆ అధికారి సూర్య సీబీఐ ఆఫీసర్‌ కాకుండా అడ్డుపడతాడు. తర్వాత సూర్య ఏం చేశాడు? ఆ అధికారికి సూర్య విసిరిన సవాల్‌ ఏమిటి? అసలు సూర్యకి గ్యాంగ్‌ ఎక్కడిది? ఆ గ్యాంగ్‌ తో ఏం చేశాడు? అనేది థియేటర్‌లో చూడాల్సిందే..

కథనం : 1980..90లోని వాస్తవ సంఘటనల ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కించిన ‘స్పెషల్‌ 26’ చిత్రం ఈ సినిమాకు మాతృక. అప్పట్లో నిరుద్యోగం ఎలా ఉండేది? నిరుద్యోగుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది? ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే లంచాలు తప్పనిసరి అన్న పరిస్థితులను సినిమాలో చూపించారు. సూర్య మిత్రుడు ఎస్సై కావాలనుకుంటాడు. ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు. అవకాశం వచ్చినా... లంచం ఇవ్వలేని కారణంగా తను ఉద్యోగం పొందలేకపోతాడు. ఇంట్లో భార్యతో రోజూ గొడవలు జరుగుతుంటాయి. తన భార్య ఎవరితోనో వెళ్లిపోయిందన్న అనుమానం.. ఉద్యోగం రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటాడు. తన మిత్రుడి పరిస్థితి ఎవరికీ రాకూడదనీ...  నిరుద్యోగం, డబ్బుల్లేక బాధపడే నలుగురితో కలిసి సూర్య ఓ గ్యాంగ్‌ను ఏర్పాటుచేస్తారు. అందులో ఒకరే రమ్యకృష్ణ. వారంతా సీబీఐ ఆఫీసర్స్‌లా.. మంత్రులు, వ్యాపారస్తులపై రైడ్‌ చేసి, వారి దగ్గరున్నదంతా దోచుకెళ్లుతారు. ఈ సంఘటనలతో అసలు సీబీఐ ఆఫీసర్‌ ఉత్తమ్‌దాస్‌ రంగంలోకి దిగుతాడు. కానీ ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో పోలీస్‌ ఆఫీసర్‌ అయిన కార్తీక్‌(అభినందన ఫేం) స్పెషల్‌ ఆఫీసర్‌గా వస్తాడు. పోలీసులకు దొరికిన బుజ్జమ్మ (రమ్యకృష్ణ)  ఆధారంగా వారిని పట్టుకుందామనుకుంటారు. కానీ ఆ విషయాన్ని సూర్య ముందుగానే తెలుసుకుంటాడు. అక్కడితో ఫస్టాఫ్‌ ముగుస్తుంది.

తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో ఉన్న ప్రేక్షకుడిని సెకండాఫ్‌లో అంతే స్థాయిలో ఉంచలేకపోయాడు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. సూర్య దోచుకున్న సొమ్ము అంతా నిరుద్యోగులకి పంచుతుంటాడు. వారంతా ఉద్యోగాల్లో స్థిరపడేందుకు సహాయపడుతుంటాడు. ఇలా వచ్చిన డబ్బంతా పంచేయడంతో తన గ్యాంగ్‌లో ఉన్న వారంతా.. 'మనకంటూ ఏం మిగల్లేదు. ఏదైనా ఒక్కటి పెద్ద రైడ్‌చేసి ఆపేద్దాం' అనుకుంటారు. దానికోసం వారు ఏం చేశారు? ఏం పథకం వేశారు? ఆ ప్రయత్నంలో పోలీసులకు చిక్కారా? అసలు జరిగింది ఏమిటి? వీటన్నింటికి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : సూర్య నటనపరంగా బాగా చేశాడు.. తన తండ్రి, మిత్రుడితో వచ్చే సన్నివేశాల్లో ప్రేక్షకులను కట్టిపడేసేలా నటించాడు. రమ్యకృష్ణ తన నటన, కామెడీ టైమింగ్‌తో సినిమాను ముందుకు నడిపించింది. కీర్తి సురేశ్‌ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా... తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిరుధ్‌ అందించిన సంగీతం కూడా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఈ సినిమాను తమిళ నేటీవిటికి దగ్గరగా మలిచాడు. పాటల చిత్రీకరణ, కొన్ని సన్నివేశాల్లో తమిళ వాసన కొడుతుంది. శ్రీకర్‌ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాగానే ఉంది. దినేశ్‌ కృష్ణన్‌ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించింది. వాస్తవంగా కథ దాదాపు 30 ఏళ్ల కిందట జరుగుతున్నట్టుగా కనిపించినా స్ర్కీన్‌పై మాత్రం 2018లో జరుగుతున్నట్టుగా తీశారు. స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ఫోన్లు మాత్రం వాడకుండా... ల్యాండ్‌ఫోన్లతోనే సంభాషణలు జరిపారు. కాస్ట్యూమ్స్‌ కూడా అప్పటితరానికి చెందినవి కాకుండా కొత్తవే వాడారు. ఒక్క పాటలో కాస్ట్యూమ్స్‌ మాత్రం ముప్పై ఏళ్ల క్రితం నాటిని గుర్తుచేస్తాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ప్రేక్షకులను థ్రిల్‌ అయ్యేలా చేస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
సూర్య నటన
కొన్ని కామెడీ సీన్స్
కథలోని మెసేజ్‌

మైనస్‌ పాయింట్స్‌ :
సంగీతం
తెలుగు నేటివిటీ లోపించడం

ముగింపు : బాలీవుడ్‌ మూవీకి రీమేక్‌ అవ్వడం, సౌత్‌ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసినా.. తెలుగుదనం లేకపోవడంతో మన ప్రేక్షకులు ఈ సినిమాను ఏమేరకు ఆదరిస్తారో వేచిచూడాలి.

- బండ కళ్యాణ్‌, ఇంటర్నెట్ డెస్క్

Poll
Loading...
మరిన్ని వార్తలు