పాట్నాలో సుశాంత్‌ మెమోరియల్‌

28 Jun, 2020 06:28 IST|Sakshi

‘‘సుశాంత్‌ మెరిసే కళ్లను మళ్లీ చూడలేమని, ఆ నవ్వులను ఇక వినలేమనే నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం. సైన్స్‌ గురించి అతను చెప్పే విషయాలను ఇక వినలేమనే బాధ వెంటాడుతోంది. తన మరణం మా ఇంట్లో శాశ్వతమైన శూన్యాన్ని మిగిల్చింది’’ అని సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నటుడు సుశాంత్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను చనిపోయిన (జూన్‌ 14) 13 రోజులకు శనివారం సుశాంత్‌ కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘సైన్స్, స్పోర్ట్స్, సినిమా.. ఇలా సుశాంత్‌ బాగా ఇష్టపడిన ఈ రంగాల్లో ప్రతిభావంతులైన యువతీయువకులను ప్రోత్సహించడానికి ‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఫౌండేషన్‌’ (ఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌) ఆరంభిస్తున్నాం. పాట్నాలో సుశాంత్‌ పుట్టి, పెరిగిన ఇంటిని ‘మెమోరియల్‌’గా మార్చుతున్నాం’’ అని ఆ ప్రకటనలో   తెలిపారు. సుశాంత్‌ వాడిన టెలీస్కోప్, వేలాది పుస్తకాలు, అతని ఇతర విలువైన వస్తువులను మెమోరియల్‌లో ప్రదర్శనకు ఉంచుతామని, ఇకనుంచి అతని ఇన్‌స్టాగ్రామ్, ట్వీటర్, ఫేస్‌బుక్‌లను యాక్టివ్‌గా ఉంచుతూ, సుశాంత్‌ జ్ఞాపకాలు సజీవంగా ఉండేలా చేస్తామని కూడా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు