సుశాంత్‌ సింగ్‌కు ఉద్వాసన

17 Dec, 2019 16:55 IST|Sakshi
సుశాంత్‌ సింగ్‌,

ముంబై: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ‘సావధాన్‌ ఇండియా’ టీవీ షో నుంచి ఆయనను తొలగించారు. ఈ విషయాన్ని సుశాంత్‌ సింగ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సీఏఏకు వ్యతిరేకంగా ముంబైలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనను తొలగించారని తెలుస్తోంది. ‘సావధాన్‌ ఇండియా కార్యక్రమంతో తన మజిలీ ముగిసింద’ని సుశాంత్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకున్నారా అని అనీష దత్‌ అనే యువతి ప్రశ్నించగా... ‘చాలా తక్కువ మూల్యం’ అని సమాధానం ఇచ్చారు. ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు.

రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన సుశాంత్‌ సింగ్‌.. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, పంజాబీ, కన్నడ భాషల్లోనూ నటించారు. 2011 నుంచి స్టార్‌ భారత్‌లో ప్రసారమవుతున్న ‘సావధాన్‌ ఇండియా’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సుశాంత్‌ సింగ్ ఉద్వాసనపై స్టార్‌ నెట్‌వర్క్‌ ఇంకా స్పందించలేదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినందు వల్లే నిర్మాతలపై ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకొచ్చి సుశాంత్‌ను టీవీ కార్యక్రమం నుంచి ఉద్వాసనకు గురయ్యేలా చేశారని నెటిజనులు ఆరోపిస్తున్నారు. తనను ఎవరైనా ప్రశ్నిస్తే ప్రధాని మోదీ తట్టుకోలేరని విమర్శిస్తున్నారు. (పౌరసత్వ రగడ: నటి ఆవేదన)

సీఏఏ వ్యతిరేక నిరసనలో సుశాంత్‌ సింగ్‌

మరిన్ని వార్తలు