సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ : కీలక ప్రకటన

27 Jun, 2020 14:32 IST|Sakshi

 సుశాంత్ జ్ఞాపకాలు, వారసత్వాన్ని కొనసాగిస్తాం 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ 

స్మారక  చిహ్నంగా  సుశాంత్ చిన్ననాటి ఇల్లు

సాక్షి, ముంబై: చెట్టంత కొడుకును కోల్పోవడాన్ని మించిన విషాదం ఈ ప్రపంచంలో బహుశా మరొకటి ఉండదేమో. 13 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం అంతటి విషాదాన్నుంచి ఇపుడిపుడే కోలుకుంటోంది. సుశాంత్ కు తుది నివాళులర్పించిన కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ (ఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పాట్నాలో సుశాంత్ చిన్నతనంలో తిరిగిన ఇంటిని ఒక స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుశాంత్ కుటుంబం ఒక ప్రకటనలో విడుదల చేసింది.  (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!)

సుశాంత్ కు నివాళిగా సినిమా, క్రీడలు, విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతులైన వారికి సాయం చేయాలని నిర్ణయించింది. అలాగే పాట్నాలోని రాజీవ్ నగర్‌లోని ఏర్పాటు చేయబోయే స్మారక చిహ్నంలో సుశాంత్ వ్యక్తిగత జ్ఞాపకాలు, వస్తువులు ఉంచుతామని తెలిపింది. అందులో వేలాది పుస్తకాలు, టెలిస్కోప్, ఫ్లైట్-సిమ్యులేటర్ మొదలైనవి అభిమానుల కోసం అందుబాటులో ఉంటాయనీ వెల్లడించింది.  దీంతోపాటు అతని జ్ఞాపకాలు సజీవంగా ఉంచేందుకు సుశాంత్ ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్ పేజీని లెగసీ ఖాతాలుగా నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపింది. (సుశాంత్‌ ఫైనల్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌)

“గుడ్ బై సుశాంత్!” సుశాంత్ కలల్ని, ఆ కళ్లలోని మెరుపును ఇక చూడలేం. తన కలల ప్రపంచాన్ని, తనకెంతో ఇష్టమైన చుక్కలను, టెలీస్కోప్‌ను వదిలి.. తానెప్పుడూ కలలుగనే అనంత విశ్వంలో ఆకాశంలోని చుక్కల్లో కలిసి పోయాడు.  సైన్స్ గురించి అతని తపనను మళ్లీ చూడలేం. ఈ లోటు తీరనిది. ఎప్పటికీ పూడని శాశ్వత శూన్యతను సృష్టించింది. సింహంలా కలలు గన్న సుశాంత్ తమకు ప్రేరణ. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక మాకు గుల్షన్ మాత్రమే.. అభిమానులలో ప్రతి ఒక్కరినీ నిజంగా ప్రేమించాడు. ఎంతో ఇష్టపడ్డాడు.  గుల్షన్‌ను ఎంతో ప్రేమతో నింపినందుకు అందరికీ ధన్యవాదాలు'' 

కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీ ప్రపంచాన్ని, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నెపొటిజమ్ లేదా బంధుప్రీతి బాలీవుడ్‌ను ఏలుతోందంటూ దుమారం  రేగిన  సంగతి తెలిసిందే.


.

మరిన్ని వార్తలు