సుశాంత్‌ ఫైనల్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌

24 Jun, 2020 20:21 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్‌ మరణంపై సోషల్‌ మీడియాలో పలు రకాలు కథనాలు వెలువడుతున్నాయి. సుశాంత్‌ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అతని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తాజాగా సుశాంత్‌ ఫైనల్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ను వైద్యులు సమర్పించారు. ఊరివేసుకోవడం వల్లనే సుశాంత్‌ మరణించారని వైద్యులు అందులో స్పష్టం చేశారు. ఐదుగురు వైద్యులు సమర్పించిన ఈ రిపోర్ట్‌లో పలు వివరాలను పొందుపరిచారు.(చదవండి : సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య)

ఊరి వేసుకోవడం కారణంగా ఊపిరాడక సుశాంత్‌ మృతిచెందినట్టుగా వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అంతర అవయవాల పరీక్షల రిపోర్ట్‌ కోసం ఫొరెన్సిక్‌ డీజీకి లేఖ రాశారు. సుశాంత్‌ శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. చనిపోయే ముందు అతను ఎలాంటి బాధ అనుభవించినట్టు ఆధారాలు కనిపించలేదని  రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఇది కేవలం ఆత్మహత్యే అని.. అందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. 

మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుంది. ఇప్పటివరకు 23 మందిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారించిన వారిలో సుశాంత్‌ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇంట్లో పనిచేసేవారు, సినీ ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉన్నారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న రోజు అతను ఉంటున్న బిల్డింగ్‌లో సీసీ కెమెరాలు పనిచేశాయని వెల్లడించారు. అలాగే అతని కుక్క వేరే రూమ్‌లో ఉందని.. అది బతికే ఉందని తెలిపారు. సుశాంత్‌ మరణంపై భిన్న కథనాలు ప్రచురించిన వెబ్‌సైట్లను విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ కథనాలు ప్రచురించడానికి గల ఆధారాలపై వారిని ప్రశ్నించనున్నట్టు తెలిపారు. (చదవండి : సుశాంత్‌ ఆత్మహత్య: సీబీఐ విచారణకు ఫోరం)

మరిన్ని వార్తలు