సుస్మిత, సన్నీ లియోన్‌లాగే మీరు కూడా..

12 Nov, 2019 16:01 IST|Sakshi

‘నేను ఎంచుకున్న టాపిక్‌ అనాథలను దత్తత తీసుకోవడం. ప్రతీ ఒక్క చిన్నారికీ జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి మానవత్వంతో అనాథలను దత్తత తీసుకోవడం ఉత్తమం. కన్నబిడ్డలు కాకపోయినా వారితో బంధం ఎంతో అందంగా ఉంటుంది. మీరు వారికి కొత్త జన్మ ఇచ్చినవారు అవుతారు. ఒకరిని రక్షించిన వారవుతారు. పిల్లలు కల్మషం లేనివారు. వారు ఎవరినైనా ఇట్టే ప్రేమించగలుగుతారు. ముఖ్యంగా అనాథ పిల్లలకు ఎన్నడూ ప్రేమ దొరికి ఉండదు. కాబట్టి మీ ప్రేమతో వారిని అక్కున చేర్చుకోండి. సుస్మితా సేన్‌ ఇద్దరు అనాథ అమ్మాయిలను, సన్నీ లియోన్‌ ఒకరిని దత్తత తీసుకున్నారు. నిజానికి నేను కూడా ఒకప్పుడు అనాథగా ఉన్నా. కానీ ఇప్పుడు అలా కాదు. నాకు అందరూ ఉన్నారు. ఈ భావన అత్యద్భుతం’ అంటూ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ పెంపుడు కూతురు అలీషా రాసిన భావోద్వేగపూరిత వ్యాసం నెటిజన్ల మనసు దోచుకుంటోంది. చిన్నతనంలోనే ఇంత గొప్ప ఆలోచన.. అంతకుమించిన అవగాహన అంటూ పలువురు సుస్మిత కూతురిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సుస్మిత తను నన్ను కన్నీళ్లు పెట్టించింది అనే క్యా‍ప్షన్‌ జతచేశారు. అనాథ చిన్నారుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై అలీషా రాసిన వ్యాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లక్షల్లో లైకులు కొట్టి ఆమెను ప్రశంసిస్తున్నారు.

కాగా 2000లో సుస్మితా సేన్‌ రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని తల్లిగా మారారు. ఆ తర్వాత పదేళ్లకు రీనికి తోడుగా అలీషా అనే మరో అమ్మాయిని సైతం దత్తత తీసుకుని.. ఆమెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరి బాగోగులు చూసుకుంటూ తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక తన కూతుళ్లు ఎంతో తెలివిగలవారని తరచుగా చెప్పే  సుస్మితా.. వాళ్లు తన హృదయం నుంచి జన్మించారని ప్రేమను చాటుకుంటారు. అదే విధంగా ఇద్దరూ కూడా దత్తపుత్రికలే అనే విషయం వారికి కూడా తెలుసునని.. వాళ్లు ఎంతో పరిణతితో ఆలోచిస్తూ ప్రతీ విషయాన్ని అర్థం చేసుకోగల వ్యక్తిత్వం గల వారని గతంలో చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా