నేను ఒంటరిని ఎలా అవుతా?

2 May, 2020 00:31 IST|Sakshi
ఇర్ఫాన్‌ భార్య, కుమారులు

– సుతాపా ఇర్ఫాన్‌

‘‘ఇర్ఫాన్‌ మరణాన్ని ప్రపంచం మొత్తం తమ సొంత మనిషిని కోల్పోయినట్టు భావిస్తుంటే, ఈ లేఖను కేవలం కుటుంబ సభ్యులు విడుదల చేసింది అని ఎలా పేర్కొనగలను? ప్రపంచం మొత్తం నాతో పాటే బాధలో ఉంటే నేను ఒంటరిని అని ఎలా అనుకోగలను?’’ అన్నారు ఇర్ఫాన్‌ భార్య సుతాపా. ఇర్ఫాన్‌ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఓ లేఖను రాసుకొచ్చారు. అందులోని సారాంశం ఈ విధంగా.

‘‘అందరూ మనం ఏదో కోల్పోయాం అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆయన నేర్పిన ఎన్నో విషయాలను అనుసరించేందుకు, అనుసరించి సరైన మార్గంలో ప్రయాణించేందుకు మంచి అవకాశం. ఇర్ఫాన్‌ మీద నాకున్న ఒకే ఒక్క ఫిర్యాదు ఏంటంటే,  ఇర్ఫాన్‌ జీవితం మొత్తం పర్ఫెక్షన్‌ కోసం ప్రయత్నించారు. అదే నన్నూ పాడు చేసింది. దాంతో జీవితంలో సాధారణమైన  వాటికి పరిమితం కావడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఆయన ప్రతి దాంట్లో ఒక రిథమ్‌ చూసేవారు. దానికి తగ్గట్టు నడుచుకోవడం నేను అలవాటు చేసుకున్నాను.

ఏ ఆహ్వానం లేకుండా మా  ఇంటికి వచ్చిన అతిథిలోనూ (క్యాన్సర్‌) ఒక రిథమ్‌ చూశారాయన. నేను డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులను స్క్రిప్ట్‌ లాగా భావించేదాన్ని. అందులోనూ ఆయన పెర్ఫార్మన్స్‌ అద్భుతంగా ఉండాలనుకునేదాన్ని. ఈ ప్రయాణంలో ఎంతోమంది వైద్యుల సహకారం మరువలేనిది. మా కుటుంబ ప్రయాణాన్ని పడవలో ఉన్నట్టు ఊహిస్తుంటా. మా పిల్లలు బబిల్, అయాన్‌ ముందు ఉండి నడిపిస్తున్నట్టు వెనక నుంచి ఇర్ఫాన్‌ అటు కాదు ఇటు అని వాళ్లను గైడ్‌ చేస్తునట్టు అనుకుంటా.

కానీ జీవితం సినిమా కాదు, సినిమాలో ఉన్నట్టు జీవితంలో రీటేకులు ఉండవు కదా. నాన్న లేకుండానే మా పిల్లలు ఈ ప్రయాణాన్ని సాగిస్తారనుకుంటున్నాను. ‘అనూహ్యమైన సంఘటనలు జరిగినా వాటికి అనుగుణంగా మారుతూ నువ్వు నీ నమ్మకంతో ముందు వెళ్లాలి’ బబిల్‌. ‘నీ మనసు చెప్పినట్టు నువ్వు వినకుండా, నువ్వు చెప్పినట్టు అది వినేలా చేసుకో’ అయాన్‌. ఆయనను మేము దాచిపెట్టిన చోటులో ఆయనకు నచ్చిన మొక్కను నాటుతుంటే కంట్లో నీళ్లు ఆగలేదు. అది చిగురిస్తుంది. ఆ సువాసన ఆయన్ను ప్రేమించిన అందరికీ వెదజల్లుతుంది అనుకుంటున్నాను’’ అని ఎమోషనల్‌ గా రాసుకొచ్చారు సుతాపా.

మరిన్ని వార్తలు