ఎస్వీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరు

23 Aug, 2019 18:01 IST|Sakshi

సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించనున్నారు. తాడేపల్లి గూడెంలోని ఎస్వీఆర్‌ సర్కిల్‌ వద్ద ఆగస్టు 25న ఉదయం 10.15నిమిషాలకు అభిమానుల సమక్షంలో చిరంజీవి విగ్రహావిష్కరణ చేయనున్నారు.ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు.. ఈయన కృష్ణా జిల్లా, నూజివీడులో  జూలై 3, 1918 లో జ‌న్మించగా.. 18 జూలై 1974లో ప‌ర‌మ‌ప‌దించారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో న‌టించారు. షేక్ స్పియ‌ర్ డ్రామాల్లో న‌టించిన అనుభ‌వంతోనే సినీన‌టుడు అయ్యారు.

చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయ‌న‌ నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు