మళ్లీ పెళ్లి వదంతులు

15 Sep, 2014 00:48 IST|Sakshi
మళ్లీ పెళ్లి వదంతులు

 నిప్పులేనిదే పొగ రాదంటారు. అయితే  మన నాయికలు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెట్టేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నటి స్వాతి కూడా ప్రస్తుతం ఈ తరహా వదంతులతోనే విసిగిపోతోందట. తెలుగులో కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందిన ఈ ముద్దు గుమ్మ తమిళంలో సుబ్రమణిపురం చిత్రంలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం కార్తికేయన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీపై ఇప్పటికే పలు వదంతులు ప్రచారమయ్యాయి.
 
 తాజా గా ఒక తమిళ నటుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు త్వరలో అతనితో మూడు ముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులపై స్వాతి మండిపడుతోంది. ఇప్పటికే చాలా మందితో చాలా సార్లు పెళ్లి చేసేశారు. ఇప్పుడు మళ్లీ పెళ్లి అంటూ అసభ్య ప్రచారం చేస్తున్నారు అంటూ వాపోయింది. దీని గురించి స్వాతి మాట్లాడుతూ ఇంతకు ముందు ఒక వ్యాపార వేత్తను కలుసుకున్నానని ఆ యన్నే పెళ్లి చేసుకోనున్నానని ప్రచారం చేశారని అంది.
 
 నిజానికి తాను ఏ వ్యాపార వేత్తను కలుసుకున్నానో తనకే తెలియదంది. తాను చెన్నైలో జరి గే షూటింగ్‌లో పాల్గొన్నా షూటింగ్ పూర్తి అయిన తరువాత తిన్నగా బ స చేసే హోటల్ గదికి చేరుకుంటానుగానీ పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లనని చెప్పింది. అయినా ఎవరో? ఎందుకు ఇలాం టి వదంతులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఒక తమిళ నటుడ్ని ప్రేమిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఇందులోనూ ఎలాంటి నిజం లేదని స్వాతి స్పష్టం చేసింది.