టీజర్‌ అదిరిపోయింది

22 Aug, 2018 01:54 IST|Sakshi

‘‘నాన్నగారి (చిరంజీవి) టీజర్‌ లాంచ్‌ ప్రోగ్రామ్‌కి నానమ్మ (అంజనాదేవి), అమ్మ (సురేఖ)లను పిలిచాను. ఈ ఇద్దరి ఆశీర్వాదం కన్నా నాకు ఇంకేం కావాలి. ఇది నాన్నగారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అందుకే నంబర్స్‌ గురించి ఆలోచించడం లేదు. ఆయనకు కావాల్సినట్లుగా సినిమా తీయడమే నా లక్ష్యం. ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు రామ్‌చరణ్‌. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేఖ సమర్పణలో చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. బుధవారం చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా మంగళవారం ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. చిరంజీవి తల్లి అంజనాదేవి, ఆయన సతీమణి సురేఖ కలిసి టీజర్‌ను లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా అంజనాదేవి మాట్లాడుతూ– ‘‘టీజర్‌ అదిరిపోయింది’’ అన్నారు. ‘‘టీజర్‌ చాలా చాలా బాగుంది. మాటలు సరిపోవడం లేదు. బాగా తీసిన డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి థ్యాంక్స్‌’’ అన్నారు సురేఖ. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ– ‘‘సైరా’ సినిమా గురించి చాలా మందికి తెలసుకోవాలని ఉంది. అందుకే నాన్నగారి బర్త్‌డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేశాం. బహుశా.. 12ఏళ్ల క్రితం ఈ కథను పరుచూరి బ్రదర్స్‌ చెప్పారనుకుంటా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ వర్కౌట్‌ అయ్యిందంటే దానికి కారణం ఈ ఇద్దరే. ‘ధృవ’ తర్వాత సురేందర్‌ రెడ్డిగారు వేరే కథలు వెతుకుతున్నప్పుడు ఓ సారి పరుచూరి బ్రదర్స్‌ని కలవమని చెప్పాను. కథ విని, ఆయన నాన్నగారు చేస్తే బాగుంటుంది అన్నారు. కానీ, చరణ్‌ అడిగాడు కదా అని ‘ఎస్‌’ చెప్పలేదు. కథే పెద్ద హీరో. మళ్లీ నాన్నగారిని డైరెక్ట్‌ చేయడం అంటే.. అని ఆయన వారం రోజులు ఆలోచించుకున్నాక ఓకే అన్నారు.

ఇలా 12 ఏళ్లుగా నాన్చుతున్నది ఒకే ఒక్క సిట్టింగ్‌లో అయిపోయింది. ‘సైరా’ సౌత్‌ లాంగ్వేజెస్‌ అన్నింటిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ ప్లాన్‌ చేశాం. కొన్ని అనివార్య కారణాల వల్ల టీజర్‌ను థియేటర్‌లో ప్రదర్శించలేకపోతున్నాం. కానీ ఆ ప్రాసెస్‌ మొదలైంది. రెండు వారాల్లో చేస్తాం. అమిత్‌ త్రివేదికి నేను పెద్ద ఫ్యాన్‌ని. టీజర్‌లో మంచి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన క్లైమాక్స్‌ సాంగ్‌ ఇచ్చారు. ఈ సినిమాలో భాగమైన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం ఏడాది పరిశోధన చేశాం.

ఆ కాలంనాటి గెజిట్‌ నోట్స్, ఆధారాలు సేకరించాం. చిరంజీవిగారిని డైరెక్ట్‌ చేస్తుండటం నా అదృష్టం. నరసింహారెడ్డి పాత్రకు ఆయన సరైన ఎంపిక. ఆయన డూప్‌ లేకుండా కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చేస్తున్నారు. ఆయనతో ట్రావెల్‌ చేస్తుంటే అర్థం అవుతోంది నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని. ఈ సినిమాకు సెకండ్‌ పిల్లర్‌ రామ్‌చరణ్‌. పది సినిమాలు చేయడం ఒక ఎత్తు. ఈ సినిమా చేయడం ఒక ఎత్తు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఉంటుంది. సుష్మిత, ఉత్తర మంచి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తున్నారు’’ అన్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ‘‘చిరంజీవిగారి సినిమాలకు మాటలు రాసే అవకాశం వస్తుందని ఊహించలేదు. నా జన్మ ధన్యమైపోయింది.

గతేడాది ‘ఖైదీ నంబర్‌ 150’ చేశా. ఇప్పుడు ‘సైరా’కి రాస్తున్నా. ఈ చిత్రం సంచనాలు సృష్టిస్తుంది’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా. ‘‘చిరంజీవి జీవితం, మా జీవితం ‘ఖైదీ’ సినిమాతో ముడిపడి ఉంది. అలా ఒకరి మనసుల్లో ఒకరం ఖైదీల్లా బందీ అయిపోయాం. కుటుంబాన్ని పైకి తెచ్చే అద్భుతమైన కొడుకును కన్నారు అంజనాదేవిగారు. రామ్‌చరణ్‌ చాలా తెలివైన నిర్మాత’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ‘‘చిరంజీవిగారి నటన అంతా ఆయన కళ్లలో ఉంటుంది. అద్భుతమైన నటుడు. ‘సైరా’ సినిమా చేస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘టీజర్‌ చూసి చాలా ఎమోషనల్‌ అయ్యాం. నాన్నగారి కాస్ట్యూమ్స్‌ కోసం దాదాపు 8 నెలలు పరిశోధన చేశాం’’ అన్నారు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత. ఈ కార్యక్రమంలో కెమెరామేన్‌ రత్నవేలు, గ్రాఫిక్స్‌ కమల్‌ కణ్ణన్, స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ లీ విట్టేకర్‌ తదితర చిత్రబృందం పాల్గొని ‘సైరా’ చిత్రం గురించి మాట్లాడారు. 

మరిన్ని వార్తలు