మదరాసులో మకాం

30 Nov, 2018 01:05 IST|Sakshi
చిరంజీవి

నరసింహారెడ్డి తన సైన్యంతో తమిళనాడు బయలుదేరారు. 18 రోజుల పాటు అక్కడే మకాం అట. స్వాతంత్య్ర ఉద్యమంలో ఏదైనా రహస్య సమావేశాల కోసమా? యుద్ధం తాలూకా వ్యూహ రచనలా? ప్రస్తుతానికైతే సస్పెన్స్‌. వచ్చే ఏడాది థియేటర్స్‌లో వీక్షించడమే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ న రసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్‌ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

ఇందులో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ డిసెంబర్‌ 3న తమిళనాడులో ప్రారంభం కానుంది. హొగెనక్కల్‌ జలపాతం వద్ద ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ఈ షెడ్యూల్‌ సుమారు 18 రోజుల పాటు సాగనుంది. చిత్ర తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారట. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో ఈ సినిమా సుమారు 60 శాతంపైగా పూర్తయిందని టాక్‌. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: రత్నవేలు.

మరిన్ని వార్తలు