ఆ పోటాపోటీయే మా ఎదుగుదలకు కారణం!

23 Nov, 2014 22:42 IST|Sakshi
ఆ పోటాపోటీయే మా ఎదుగుదలకు కారణం!

 హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, సిల్వెస్టర్ స్టాలెన్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నాయి. ఈ ఇద్దరూ నటించిన చిత్రాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఆర్నాల్డ్ చేసిన ‘ది టెర్మినేటర్’, సిల్వెస్టర్ స్టాలెన్ చేసిన ‘రాంబో’ చిత్రాలను చూస్తే.. వీళ్లు ఏ స్థాయి నటులో అర్థమవుతుంది. మంచి యాక్షన్ హీరోలుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ 1980ల్లో పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్లు.
 
 ఈ విషయాన్ని స్వయంగా ఆర్నాల్డే చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్నాల్డ్ గతాన్ని నెమరువేసుకున్నారు. ముఖ్యంగా సిల్వెస్టర్ స్టాలెన్‌కూ, తనకూ మధ్య ఉన్న పోటీ గురించి చెబుతూ - ‘‘మాలో ఎవరు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు? అనే విషయం నుంచి సినిమాల్లో ఎవరు ఎక్కువమంది విలన్లను చంపాం? ఎంత కొత్తగా చంపాం? అని చెక్ చేసుకునేవాళ్లం. ఫిట్‌నెస్ విషయంలో కూడా పోటీయే. ఎవరి సినిమా ఎక్కువ వసూలు చేసిందో చూసుకునేవాళ్లం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది కాదు.
 
 ఒకరినొకరు బాగా ద్వేషించుకునేవాళ్లం. పరిపక్వత లేకనే ఆ ద్వేషం. 1990లలో ఇద్దరికీ మానసిక పరిపక్వత పెరగడంతో స్నేహితులమయ్యాం. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. మా మధ్య ఉన్న పోటీతత్త్వమే మా అభివృద్ధికి తోడ్పడింది. శత్రువులుండడం చాలా ముఖ్యం. ఆ శత్రువును ఢీ కొనడానికి పరుగులుపెడతాం, కష్టపడతాం. ఫలితంగా పైకొస్తాం. మా విషయంలో జరిగింది అదే’’ అని చెప్పారు.