పాటపాడి అలరించనున్న హీరో తండ్రి..

13 Sep, 2017 21:09 IST|Sakshi
పాటపాడి అలరించనున్న హీరో తండ్రి..

చెన్నై: తెలుగు చిత్రపరిశ్రమలో 15 శాతం జీఎస్‌టీ పన్నునే అమలవుతోందని, అక్కడ రాష్ట్రప్రభుత్వాలు అదనంగా పన్నును విధించడం లేదని సీనియర్‌ నటుడు, దర్శకుడు టి. రాజేందర్‌ పేర్కొన్నారు. ఆయన కుమారుడు శింబు హీరోగా నటించిన ఇదునమ్మ ఆళం చిత్రం సరసుడు పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు తమిళనాడులో విడుదల కానుంది. తమిళంలో శింబు, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని శింబు ఆర్ట్స్‌ పతాకంపై టి. రాజేందర్‌ నిర్మించిన విషయం తెలిసిందే.

ఈయన రెండో కుమారుడు కురలరసన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రంలో 50,60 సన్నివేశాలను రీషూట్‌ చేసి తెలుగులో నేరు చిత్రంగా విడుదల చేస్తున్నారు. అదే విధంగా తమిళంలో పొందుపరచని హలో పాటను తెలుగు చిత్రంలో చేర్చామని, ఈ పాట యువతను అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. దీనికి సరసుడు అనే టైటిల్‌ను పెట్టారు.

ఇందులో టి. రాజేందర్‌ ఒక పాటను రాయడంతోపాటు ఒక పాటను పాడటం విశేషం. సరసుడు చిత్రాన్ని తానే శింబు ఆర్ట్స్‌ బ్యానర్‌లో సొంతంగా విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమసాగరం చిత్రం నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. అదే విధంగా తన కొడుకు శింబు నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి మంచి విజయాన్ని సాధించయన్నారు. అలా, మన్మధ, వల్లభ చిత్రాల తరువాత ఈ సరసుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.