కాలేజీ గర్ల్‌లా కనిపిస్తే ఏమీ అనలేదే?!

4 Jun, 2019 13:18 IST|Sakshi

వయస్సు మళ్లిన పాత్రల్లో నటిస్తే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడమేంటని హీరోయిన్‌ తాప్సీ ఫైర్‌ అయ్యారు. ముప్పై ఏళ్ల వయస్సులో కూడా కాలేజీ అమ్మాయిలా కనిపించినపుడు ఏమీ అనని వారు ఇప్పుడెందుకు ట్రోల్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. టాలీవుడ్‌ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. తొలుత గ్లామర్‌ డాల్‌ పాత్రలకే పరిమితమైన తాప్సీ ఇటీవల కాలంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంలో ‘సాంద్‌ కీ ఆంఖ్‌’  అనే సినిమాకు సైన్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో తాప్సీ కనిపించనున్నారు. ఇందులో తాప్సీతో పాటు మరో బ్యూటీ భూమి ఫడ్నేకర్‌ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవలే రిలీజ్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం పట్ల తాప్సీ స్పందించారు. ‘ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 30 ఏళ్ల వయస్సులో నేను కాలేజీ అమ్మాయిగా నటించినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అలాగే కొంతమంది అరవై ఏళ్ల వయస్సులోనూ చిన్న పిల్లల క్యారెక్టర్లు వేసినా పట్టించుకోరు. మరి చాలెంజింగ్‌ రోల్స్‌ చేస్తున్న నన్ను, భూమిని ఎందుకు తప్పుబడుతున్నారు. మా లుక్‌ను హేళన చేస్తున్నారు. ఇది సరైంది కాదు. ఇది మా జీవితంలో రిస్క్‌ కాదు. ఒక గొప్ప అనుభూతి. రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ ఎంతో స్ఫూర్తినిస్తాయి’ అని కౌంటర్‌ ఇచ్చారు.

కాగా 60 ఏళ్ల తర్వాత షూటర్స్‌గా తమ కెరీర్‌ను స్టార్ట్‌ చేసి కొన్ని వందల పతకాలు అందుకున్న ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్‌ జీవితాల ఆధారంగా ‘సాంద్‌ కీ ఆంఖ్‌’  తెరకెక్కింది. అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్‌ హిరానందన్‌ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా దీపావళికి రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు