సినిమా శాశ్వతం కాదు : తాప్సీ

16 Dec, 2018 08:46 IST|Sakshi

స్నేహితులతో సన్నిహితంగా ఉంటే కష్టమే అంటోంది నటి తాప్సీ. నటన, అవకాశాల మాట అటుంచితే ఏదో ఒక అంశంతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి తాప్సీ. మొదట్లో దక్షిణాదిలోనే రాణించాలని ఆశ పడినా అది పెద్దగా తీరలేదు. ముఖ్యంగా కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలన్నది తాప్సీ తపన. అయితే అలాంటి అవకావాలు ఇక్కడ పెద్దగా రాలేదు. కాంచన లాంటి ఒకటీ అరా వచ్చినా, ఆ చిత్రాలు విజయం సాధించినా, తాప్సీని మాత్రం పట్టించుకోలేదు. ఇక టాలీవుడ్‌లో ఈ అమ్మడిని గ్లామర్‌కే వాడుకున్నారని చెప్పవచ్చు. అక్కడ ఆశించిన స్థాయికి చేరుకోలేకపోవడంతో తాప్సీ ముంబైకి మకాం మార్చేసింది.

అక్కడ పింక్‌, నామ్‌ షబానా వంటి చిత్రాలు తాప్సీ కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేశాయి. దీంతో ఉత్తరాది సినిమాలతో బిజీ అయిపోయింది. మరో విషయం ఏమిటంటే నిర్మాతగానూ అవతారమెత్తేసింది. అవును తాప్సీ నటిస్తున్న ద్విభాషా చిత్రం గేమ్‌ ఓవర్‌కు ఈ బ్యూటీ ఒక నిర్మాత అట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. ఈ సందర్భంగా తాప్పీ ఏమంటుందో చూద్దాం. అధిక చిత్రాల్లో నటించడం కంటే మంచి కథా బలమున్న చిత్రాలు కొన్ని చేసినా చాలు అని పేర్కొంది. తమిళ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకోవాలన్నదే తన చిరకాల కోరిక అని చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం నటిస్తున్న గేమ్‌ ఓవర్‌ చిత్రం తన కోరిక నెరవేర్చుతుందనే నమ్మకం ఉంది. ఇది తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం అని తెలిపింది. ఈ చిత్రానికి తానూ ఒక నిర్మాతనని చెప్పింది. విభిన్న గేమ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది అని పేర్కొంది. తన తొలి తెలుగు చిత్ర నిర్మాత అయిన నటి లక్ష్మీమంచు మాత్రమే తనకు అత్యంత సన్నిహితురాలు అని పేర్కొంది.

స్నేహితులతో ఎక్కువ సన్నిహిత సంబంధాలను పెట్టుకుంటే సినిమాను వదిలి వెళ్లడం కష్టం అని అంది. అందుకే తాను స్నేహితులకు అధిక ప్రాధాన్యతనివ్వడం లేదని పేర్కొంది. సినిమా నిరంతరం కాదని, ఎప్పుడైనా దీన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుందని, అందుకే  స్నేహితులతో పెద్దగా అటాచ్‌మెంట్‌ పెట్టుకోనని తాప్సీ చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు