మొన్న కార్తీక.. ఇవాళ తాప్సీ

28 Jun, 2020 14:22 IST|Sakshi

ముంబై : కరోనావైరస్‌ నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలకు కరెంట్ బిల్లులు షాక్‌ ఇస్తున్నాయి.లాక్‌డౌన్‌ కారణంగా అన్ని చోట్లా మూడు నెలల కరెంట్ వాడకాన్ని కలిపి ఒకటే బిల్లును ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్లాబ్‌లు మారి ప్రతి ఒక్కరికీ భారీగా చార్జీలు పడ్డాయి. వందలలో వచ్చే వారికి వేలల్లో, అలాగే వేలల్లో వచ్చేవారికి లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. చిన్న చిన్న గుడిసెలకు సైతం ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులకే కాదు ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా ఈ షాక్‌లు తగులుతున్నాయి. (క‌రెంటు బిల్లు చూసి గుడ్లు తేలేసిన హీరోయిన్‌)

ఇటీవల అలనాటి అందాల భామ రాధ కుమార్తె, హీరోయిన్‌ కార్తీక ఇంటికి లక్ష రూపాయల కరెంట్‌ బిల్లు రాగా, తాజాగా మరో హీరోయిన్‌ తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే ఈ నెలలో (జూన్‌) దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది. ట్వీటర్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్‌ బిల్లు రావడం ఏంటని వ్యంగ్యంగా తన అసంతృప్తిని వెలిబుచ్చింది.

‘ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. క్లీనింగ్‌ కోసమని వారంలో ఒక రోజు ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మాములు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే  మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికితీసేందుకు నాకు సహాయం చేయడంటూఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్‌ చేసింది. 

మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆమె ప్రశ్నించారు. కాగా తాప్సీ ట్వీట్‌పై స్పందించిన ఎలక్ట్రిసిటీ అధికారులు.. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా తాము బిల్లు కొట్టామని వివరణ ఇచ్చారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు