‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

16 Jul, 2019 13:24 IST|Sakshi

అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డిని విమర్శించబోయి తానే విమర్శల పాలవుతున్నారు నటి తాప్సీ. వివరాలు.. కబీర్‌సింగ్‌ చిత్రంలో కియారా అద్వాణీ, షాహీద్‌ కపూర్ల మధ్య వచ్చే సన్నివేశాల గురించి సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరలేపాయి. సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, మంచు లక్ష్మి తదితరులు సందీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సందీప్‌ను విమర్శించే ఉద్దేశంతో తాప్సీ చేసిన ఓ ట్వీట్‌ తెగ ట్రోల్‌ అవుతుంది. నాగపూర్‌కు చెందిన ఓ యువకుడు అనుమానంతో తన ప్రేయసి తల పగలగొట్టి చంపేశాడు. ఇందుకు సంబంధించిన వార్త అన్ని ఆంగ్ల మీడియా సైట్లలో వచ్చింది. ఈ క్రమంలో తాప్సీ దీనికి సంబంధించిన ఓ ఆర్టికల్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో... వారి ప్రేమను నిరూపించుకోవడానికి ఇలా చేశారు’ అంటూ పరోక్షంగా సందీప్‌ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.
 

దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇతరుల చావు వార్తల్లో మీకు వ్యంగ్యం కనిపించిందా అంటూ తాప్సీని ట్రోల్‌ చేస్తున్నారు. విమర్శలపై స్పందించిన తాప్సీ ‘వ్యంగ్యోక్తులను అర్థం చేసుకోలేని వారు నన్ను, నా ట్వీట్‌ను పట్టించుకోవద్దు’అంటూ మరో ట్వీట్‌ చేశారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు