సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్‌ పాలసీ

29 May, 2020 00:21 IST|Sakshi

‘‘సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టబోతున్నాం’’ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సినిమా, టీవీ షూటింగ్‌ అనుమతులు, థియేటర్ల రీ ఓపెనింగ్‌ తదితర అంశాలపై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్‌ల ప్రతినిధులతో తలసాని శ్రీనివాస్‌ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిషోర్‌బాబు గురువారం సమావేశం నిర్వహించారు.

సినిమా థియేటర్‌లకు ప్రత్యేక విద్యుత్‌ టారిఫ్, ఫ్లెక్సీ టికెటింగ్‌ ధరలు, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం, కళాకారులకు పెన్షన్‌లు, తెల్ల రేషన్‌ కార్డులు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ‘‘సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్‌ పాలసీలో ఈ అంశాలను పొందుపరచడం జరుగుతుంది. సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించడం జరగుతుంది’’ అని తలసాని చెప్పారు. సినీ రంగానికి చెందిన ప్రతినిధులు షూటింగ్‌ ప్రదేశాలలో, థియేటర్‌లలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.

అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్‌ ముగిసిన అనంతరం ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొనగా, పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్‌లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు.

ఈ సమావేశంలో నటుడు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్‌. శంకర్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, నిర్మాతలు సి. కళ్యాణ్, కేఎస్‌ రామారావు, సురేష్‌ బాబు, మా అధ్యక్షులు నరేష్, అసోసియేషన్‌ ప్రతినిధులు దామోదర్‌ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ల ప్రతినిధులు బాపినీడు, పి. కిరణ్, ఎగ్జిబిటర్స్‌ ప్రతినిధులు విజయేందర్‌ రెడ్డి, సునీల్‌ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మురళీ మోహన్, ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ రామ్మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు