మనసిలాయో?

19 Aug, 2016 23:55 IST|Sakshi
మనసిలాయో?

ఈ హెడ్డింగ్ చూసి తమన్నా ఎవరి పైనో మనసు పడింది అనుకుంటున్నారా? అదేం లేదండీ. మలయాళంలో ‘మనసిలాయో’ అంటే ‘అర్థమైందా?’ అని అర్థం. ఇప్పుడు మలయాళం అర్థం చేసుకునే పనిలో ఉన్నారు తమన్నా. ఎందుకంటే.. ఓ మలయాళ సినిమా అంగీకరించారీమె. రితీష్ అంబట్ దర్శకత్వంలో దిలీప్, సిద్ధార్ధ్ హీరోలుగా నటించనున్న ‘కమ్మరసంభవం’తో మాలీవుడ్‌కి తమన్నా పరిచయం కానున్నారు. ఆమె పాత్రకు ఎవరో ఒకరు డబ్బింగ్ చెప్తారు కాబట్టి, షూటింగ్‌లో డైలాగ్స్‌కి బదులు వన్.. టూ.. త్రీ నంబర్స్ చెప్పి మ్యానేజ్ చేయొచ్చు. పరభాషలో నటించేటప్పుడు చాలామంది కథానాయికలు చేసేది ఇదే.
 
  కానీ, నంబర్స్ చెప్పి మేనేజ్ చేసే రకం కాదు తమన్నా. ఈ ఉత్తరాది భామ ఎప్పుడో తెలుగు, తమిళం నేర్చుకున్నారు. తర్వాత వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పినా షూటింగ్ లొకేషన్లో మాత్రం ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష డైలాగ్స్ చెబుతారు. ఇప్పుడు మలయాళంకి కూడా అలానే చేయనున్నారు. అందుకే ఆ భాషపై పట్టు సాధించే పనిలో ఉన్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’లో సిద్ధార్ధ్, తమన్నా జంటగా నటించారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకి జోడీ కట్టారు. అన్నట్టు.. సిద్ధార్ధ్ కూడా ఈ సినిమాతోనే మాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు.