ఔనా.. తమన్నా మారిపోయిందా..!

14 Oct, 2019 20:56 IST|Sakshi

తమిళసినిమా: నటి తమన్నా మారిపోయిందట. ఏమిటా మార్పు? ఏమా కథ అంటే.. గ్లామర్‌కు మారుపేరైన ఈ అమ్మడు.. ఆదిలో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడలేదు. ఇక ఐటమ్‌ సాంగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేమంటే డాన్స్‌ అంటే నాకిష్టం అనే సమాధానం ఈ జాణ నుంచి వస్తుంది. అయితే తమన్నాలోనూ మంచి నటి ఉంది. ఆ విషయం తమిళంలో నటించిన కల్లూరి చిత్రంలోనే ఆమె నిరూపించుకున్నా.. ఎందుకనో దర్శక, నిర్మాతలు తమన్నాను గ్లామర్‌ కోసం ఎక్కువగా ఫోకస్‌ చేశారు.

అయితే ప్రతి నటికీ, నటుడికీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం ఉంటుంది. అలా తమన్నా సినీ కెరీర్‌లో ‘బాహుబలి’ మెమరబుల్‌ సినిమాగా నిలిచిపోయింది. ఆ తరువాత ఈ అమ్మడికి సరైన పాత్ర లభించలేదు. మళ్లీ షరా మామూలుగా గ్లామర్‌ పాత్రలకే ఆమె మొగ్గు చూపుతూ వచ్చింది. హర్రర్‌ కథా చిత్రాలూ ఆమెకు వరుస కడుతున్నాయి. ఇలాంటి సమయంలో చిరంజీవి ‘సైరా’తో మరోసారి తనలోని నటిని బయటకు తీసే అవకాశం వచ్చింది. పాత్రలో సత్తా ఉండాలేగాని, ఎంతటి పాత్రనైనా చేస్తాననేవిధంగా ‘సైరా’లో లక్ష్మీ పాత్రకు తమన్నా జీవం పోసింది.  ఈ సినిమాలో నయనతార కంటే తమన్నా పాత్రకే ఎక్కువ పేరు వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన తమిళ చిత్రం ‘పెట్రోమ్యాక్స్‌’ తమన్నాకు  మరోసారి సక్సెస్‌ను అందించింది. బాహుబలి, సైరా, పెట్రోమ్యాక్స్‌ వంటి నట ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో తమన్నా ఇకపై గ్లామర్‌ పాత్రలకు ఒకింత దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకోవాలని ఈ అమ్మడు అనుకుంటోందని కోలీవుడ్‌ టాక్‌.  మంచి కుటుంబ కథా చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్ర చేయాలని తమన్నా కోరికను ఆహ్వానించాల్సిందే గానీ, ఈ బ్యూటీ తన మాటపై నిలబడుతుందా? ఎందుకంటే ప్రస్తుతం విశాల్‌తో నటిస్తున్న ‘యాక్షన్‌’ చిత్రంలో తమన్నా గ్లామరస్‌ పాత్రనే పోషించింది.

పెళ్లి సంగతేమిటి?
ఇక, పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి సోషల్‌ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోందని, అందులో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పింది. కొందరు ఈ విషయంలో కావాలనే కల్పిత రాతలు రాస్తున్నారని, అలాంటి కథనాలను తన వద్దకు తీసుకొస్తే, వాటిని తానే ఒక చిత్రంగా నిర్మించడానికి సిద్ధమని కొంచెం ఘాటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో గోపీచంద్‌కు జంటగా నటిస్తోంది. అదే విధంగా హిందీ చిత్రం క్వీన్‌ తెలుగు రీమేక్‌ దటీజ్‌ మహాలక్ష్మీ చిత్రంలోనూ కనిపించనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా