ఆ పిల్లను కొనేశాను

8 Jul, 2014 23:43 IST|Sakshi
ఆ పిల్లను కొనేశాను

 మూగజీవాలంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా శునక రాజులంటే హీరోయిన్లు చాలా ప్రేమ కురిపిస్తుంటారు. చాలామంది హీరోయిన్లలో వివిధ జాతులకు చెందిన పెట్ డాగ్స్ చూస్తుంటాం. నటి త్రిషకు శునకాలంటే ఎనలేని ప్రేమ. ఎక్కడ ఊరకుక్క కనిపించినా ఆమె దాని సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తుంటారు. అంతేకాదు శునక సంరక్షణ సంస్థకు ఆమె తన వంతు సాయం చేస్తుంటారు. అలా చాలామంది నటీమణులు శునక ప్రేమ ఒలకబోస్తూ వాటిని ముద్దాడుతూ తమ ఖాళీ సమయాన్ని గడిపేస్తుంటారు. అలాగే నటి తమన్నకు చిన్నతం నుంచే శునకాలంటే చాలా ఇష్టం అట.
 
 ఒక్క కుక్కపిల్లనైనా పెంచుకోవాలని ఆశపడేవారట. అయితే తమన్న తల్లికి నచ్చని ఏకైక విషయం కుక్కలపై ప్రేమ చూపడమేనట. దీంతో తమన్న ఇటీవల వరకు తన ఆశను తనలోనే అణగదొక్కుకుంటూ వచ్చారు. అయితే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నా ఆమెలో శునక ప్రేమ సమసి పోలేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో మిల్కీ బ్యూటీ ఒక తెలుగు చిత్రంలో శునకాలతో నటించే అవకాశం వచ్చింది. ఇది శునకమయంగా తెరకెక్కుతున్న చిత్రం అట.
 
 అలాగే నటి తమన్న పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట. చిత్రంలో శునకంతో ఆడిపాడిన తమన్నకు తన మనసులోతుల్లో దాగి వున్న శునక ప్రేమ ఒక్కసారిగా బయటకు పొంగి వచ్చిందట. దీంతో వెంటనే మంచి కుక్కపిల్లను కొనేసిందట. అమ్మ ఆగ్రహాన్ని కూడా భరించి ఇంటికి తీసుకొచ్చేసింది. ప్రస్తుతం ఏ మాత్రం సమయం దొరికినా ఆ కుక్కపిల్లకు ముద్దుపెట్టేస్తూ దాంతో ఆడుకుంటున్నారట. అంతేకాదు ఇంత కాలానికి తన కోరిక నెరవేరిందని మురిసిపోతున్నారట తమన్న.
 

>