మరీ... ఇంత అలుసా?

26 Dec, 2016 23:33 IST|Sakshi
మరీ... ఇంత అలుసా?

‘‘కథానాయికలు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్లు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీలు లేదు’’... ఇలా బహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చి, తమిళ దర్శకుడు సురాజ్‌ ఇప్పుడు ఇరుకున పడ్డారు. ఒక్కసారిగా ఇప్పుడు తమన్నా, నయనతార లాంటి హీరోయిన్లు అందరూ ఈ దర్శకుడిపై విరుచుకు పడ్డారు. ‘అమ్మాయిలంటే, అంత అలుసా?’ అని విశాల్‌ సహా హీరోలూ గొంతు కలిపారు. చినికి చినికి గాలివానగా మారిన ఈ లేటెస్ట్‌ కాంట్రవర్సీపై కథనం...

విశాల్, తమన్నా జంటగా సురాజ్‌∙దర్శకత్వం వహించిన ‘ఒక్కడొచ్చాడు’ (తమిళ మాతృక ‘కత్తి సండై’) ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో తమన్నా గ్లామరస్‌గా కనిపించారు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సురాజ్‌ను తమన్నా గ్లామర్‌ గురించి ఓ విలేకరి ఓ ప్రశ్న వేశారు. అప్పుడు సురాజ్‌... ‘కోట్ల కొద్దీ పారితోషికం తీసుకుంటున్నది అలా నటించడానికేగా?’ అని నోరు పారేసుకున్నారు. అలా అనడం ఆయనను వివాదాలపాలు చేసింది. ‘‘లోయర్‌ క్లాస్‌ ఆడియన్స్‌ని కథానాయికలు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, ఆనందపరచాలి. ఒకవేళ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కనక కథానాయికలు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్లు కవర్‌ చేసేలా డిజైన్‌ చేస్తే... ‘లెంగ్త్‌ తగ్గించండి’ అని నిర్మొహమాటంగా చెబుతా.

హీరోయిన్‌కి అసౌకర్యంగా అనిపించినా నాకు సంబంధం లేదు. ఆ డ్రెస్‌ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా’’ అని కూడా సురాజ్‌ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, మరో అడుగు ముందుకేసి, ‘ప్రేక్షకులు అసలు థియేటర్‌కి వచ్చేదే కథానాయికలను ‘అలా’ చూడ్డానికే’ అని స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రేక్షకులు డబ్బులు పెట్టి టికెట్‌ కొనేది హీరోయిన్లను అలాంటి దుస్తుల్లో చూడ్డానికే’’ అని సురాజ్‌ అనడం చర్చనీయాంశమైంది. సురాజ్‌ ఆ రోజున అసలు ఏ మూడ్‌లో ఉన్నారో, ఏమో కానీ, ‘ఒకవేళ కథానాయికలు తమ అందచందాల్ని కాకుండా, యాక్టింగ్‌ టాలెంట్‌ని మాత్రమే చూపించుకోవాలంటే టీవీ సీరియల్స్‌లో చూపించుకోమనండి’ అని కూడా నోరేసుకొని పడ్డారు. ‘‘అసలు కమర్షియల్‌ సినిమాలు చేసే నాయికలకు పారితోషికం ఇచ్చేది... ప్రేక్షకులు పెట్టే టికెట్‌ డబ్బుకి తగ్గవి ఇవ్వడం కోసమే’’ అని కూడా సురాజ్‌ తనదైన విశ్లేషణ చేసేశారు.

గది దాటి బయటికొస్తే వివాదమే!
జనరల్‌గా సినిమా పరిశ్రమలో కథానాయికల గురించి ఎక్కువగా ఇలా మాట్లాడుతుంటారు. అందరూ కాకపోయినా ఎక్కువ మందికి మాత్రం హీరోయిన్ల పట్ల ఇలాంటి చులకన భావమే ఉంటుంది. అయితే ఏం మాట్లాడినా నాలుగు గోడల మధ్య మాట్లాడేస్తారు కాబట్టి, అవి వెలుగులోకి రావు. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడితే, నాయికల మనోభావాలను దెబ్బ తీసినట్లే. ప్రముఖ తమిళ దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ అయితే గతంలో కథానాయికలను వేశ్యలతో పోల్చి, పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. ఆ సమయంలో సీనియర్‌ నటి ఖుష్బూ సదరు దర్శకుడిపై విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టి మరీ, చివరకు విజయం సాధించారు.

ఇప్పుడు డైరెక్టర్‌ సురాజ్‌ మాటలతో హీరోయిన్‌ తమన్నా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సురాజ్‌ దర్శకత్వంలోని ‘ఒక్కడొచ్చాడు’ చిత్ర హీరోయిన్‌ అయిన తమన్నా ఆయన మాటల్ని ఖండిస్తూ, స్పందించారు. కానీ, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఆ దర్శకుడి సినిమాలో నటించిన కథానాయిక ఒక్కరూ స్పందిస్తే.. సరిపోతుందా? వాస్తవానికి ‘కమర్షియల్‌ సినిమా’ల్లో నటించే ప్రతి నాయికకూ సురాజ్‌ మాటలు వర్తిస్తాయి. అందుకే ఒక గొంతుకి ఇంకో గొంతు తోడైతే  విషయం బలపడుతుంది. తమన్నా ఇలా స్పందించారో, లేదో.. మరో స్టార్‌ హీరోయిన్‌ నయనతార నుంచి కూడా గట్టి స్పందనే వచ్చింది, జనరల్‌గా మీడియాతో మాట్లాడని నయనతార... కథానాయికల గురించి సురాజ్‌ చేసిన వ్యాఖ్యలకు ఓ ‘వెబ్‌సైట్‌’ ద్వారా చాలా ఘాటుగానే స్పందించారు.

శ్రుతీహాసన్, తదితర హీరోయిన్లు పలువురు కూడా వీరి మాటలకు సంఘీభావం ప్రకటిస్తూ, ట్విట్టర్‌లో ట్వీట్‌లు, రీ–ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్ర సీమలో సురాజ్‌ మాటలు, అతనిపై విమర్శలే... పెద్ద హాట్‌ టాపిక్‌. చివరకు సురాజ్‌ వెనక్కి తగ్గి, క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అవును మరి... స్త్రీలను గౌరవించక పోగా, నోటికొచ్చినట్లు మాట్లాడితే తిప్పలు తప్పవని సురాజ్‌ లాంటి వాళ్ళకు తెలియాల్సిందే!

ఇంట్లోవాళ్ళనీ.. ఇలాగే అంటాడా?
– నయనతార
‘‘అసలు కథానాయికలపై ఇంత నీచమైన, అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసిన ఈ సురాజ్‌ ఎవరు? కథానాయికలకు డబ్బులు ఇస్తున్నారు కనుక... కెమేరా ముందుకొచ్చిన తర్వాత బట్టలు విప్పేస్తారని అతడు అనుకుంటున్నాడా? అతడి కుటుంబంలో పనిచేస్తున్న మహిళలపై ఈ కామెంట్‌ చేసే దమ్ముందా?’’ అని కథానాయిక నయనతార, సురాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అతడు ఏ కాలంలో ఉన్నాడంటూ ప్రశ్నించారు. ‘‘ఈ సంవత్సరం వచ్చిన ‘పింక్‌’, ‘దంగల్‌’ వంటి సినిమాలు మహిళల సాధికారత, గౌరవం గురించి మాట్లాడుతుంటే... సురాజ్‌ ఎక్కడ ఉన్నాడో? కమర్షియల్‌ సినిమాల్లో కథానుగుణంగానో, తమకు సౌకర్యవంతంగా అనిపిస్తేనో కథానాయికలు గ్లామరస్‌గా కనిపించే దుస్తులను ధరిస్తారు. అయినా... సురాజ్‌ ఏ ప్రేక్షకుల గురించి మాట్లాడుతున్నాడో? కథానాయికలను చిట్టిపొట్టి బట్టల్లో చూడడానికి ప్రేక్షకులు టికెట్లు కొని సినిమాలకు వస్తున్నారా! లేదు. సురాజ్‌ కన్నా ప్రేక్షకులే సినీ తారలను ఎక్కువ గౌరవిస్తున్నారు. ‘ఎక్కువ డబ్బులు తీసుకుని కథానాయికలు చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటున్నారు’ అనడం ద్వారా అతడు యువతరాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నేనూ కమర్షియల్‌ సినిమాల్లో గ్లామరస్‌గా నటించాను. అయితే, ‘లో క్లాస్‌’ ప్రేక్షకుల కోసం అలా నటించమని నా దర్శకులు బతిమాలారనో, ఎక్కువ డబ్బులు ఇచ్చారనో గ్లామరస్‌గా నటించలేదు. నేను అలాంటి సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కథానాయికలను అలుసుగా తీసుకునే హక్కు ఎవరికీ లేదు’’ అని ఘాటుగా స్పందించారు నయనతార.


అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే!
 – తమన్నా
‘‘తప్పు... నా దర్శకుడు (సురాజ్‌) చేసిన కామెంట్స్‌ నన్ను బాధించాయి. కోపమూ తెప్పించాయి. తప్పకుండా అతను క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. నాకు మాత్రమే క్షమాపణ చెబితే చాలదు. చిత్ర పరిశ్రమలో మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలి’’ అని తమన్నా సోషల్‌ మీడియా వేదికగా దర్శకుడు సురాజ్‌ని నిలదీశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ –‘‘నటీనటులుగా ప్రేక్షకులను అలరించడం మా బాధ్యత. అంతేగానీ... మమ్మల్ని వస్తువులుగా వర్ణించడం ఏ మాత్రం బాగోలేదు. నేను దక్షిణాది చిత్రాల్లో 11 ఏళ్లుగా నటిస్తున్నా. ఇన్నేళ్లుగా నాకు సౌకర్యవంతంగా అనిపించిన దుస్తులే వేసుకున్నా. మన దేశంలో మహిళల గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ప్రేక్షకులకు నేను చెప్పేదొక్కటే.... ఓ వ్యక్తి చేసిన కామెంట్స్‌ ఆధారంగా చిత్ర పరిశ్రమ అంతటినీ అదే దృష్టిలో చూడొద్దు’’ అన్నారు తమన్నా.

సారీ! నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా
– దర్శకుడు సురాజ్‌
కథానాయికల గురించి తాను చేసిన వ్యాఖ్యలు వివాదం అవుతాయని మాట్లాడుతున్న సమయంలో బహుశా సురాజ్‌ ఊహించినట్లు లేరు. అనుకోని విధంగా తమన్నా, నయనతార సహా పలువురు తారలు స్పందించడంతో... సురాజ్‌ దిమ్మెరపోయారు. దాంతో, సోమవారం సాయంత్రం ఆయన హీరోయిన్ల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ‘‘మిస్‌ తమన్నా సహా కథానాయికలందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. ఒకరి గురించి తప్పుగా మాట్లాడి, వాళ్ల మనసు బాధపెట్టాలనే ఆలోచన నాకు లేదు. నేను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నా. మరొక్కసారి క్షమాపణలు చెప్పుకుంటున్నా’’ అని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

బొత్తిగా అనవసరమైన కామెంట్స్‌ అవి!                     
– హీరో విశాల్‌
‘ఒక్కడొచ్చాడు’లో హీరోగా నటించిన విశాల్‌ ఈ వివాదం గురించి సోమవారం సాయంత్రం స్పందించారు. దర్శకుడు సురాజ్‌ క్షమాపణ చెప్పడం ఆనందం అన్నారు. ఇంకా విశాల్‌ మాట్లాడుతూ – ‘‘సురాజ్‌ అనవసరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘నడిగర సంగం’ జనరల్‌ సెక్రటరీగా కాదు, ఓ నటుడిగా ఈ మాట అంటున్నా. కథానాయికలు తమ నట ప్రతిభను కనబరుస్తున్నారు తప్ప శరీరాన్ని ప్రదర్శించడం లేదు’’ అన్నారు. ‘‘ఇలా జరిగినందుకు  సారీ’’ అని తమన్నాను ఉద్దేశించి హీరో విశాల్‌ పేర్కొనడం విశేషం.