తాప్సీ పాత్రలో తమన్నా

14 Apr, 2019 11:57 IST|Sakshi

నటి తాప్సీ నటించిన పాత్రను పోషించడానికి మిల్కీబ్యూటీ తమన్నా సిద్ధం అవుతున్నట్టు తాజా సమాచారం. అపజయాల్లో కొట్టుకుపోతున్న తమన్నాకు ఇటీవల తెలుగులో నటించిన ఎఫ్ 2 చిత్ర విజయం బోలెడంత జోష్‌ను నింపిందనే చెప్పాలి. అంతేకాదు ఆ తరువాత అవకాశాలు వరుస కట్టేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ స్విచ్‌ వేస్తే ఇక్కడ బల్బు వెలిగినట్లు, టాలీవుడ్‌లో సక్సెస్‌ వస్తే కోలీవుడ్‌లో చాన్స్‌లు వస్తున్నాయి.

అదే విధంగా ఈ అమ్మడికి హర్రర్‌ చిత్రాలు కలిసొచ్చినట్లుంది. ఆ మధ్య ప్రభుదేవాతో రొమాన్స్‌ చేసిన హర్రర్‌ కథా చిత్రం దేవి ఓకే అనిపించుకుంది. తాజాగా దానికి సీక్వెల్‌గా అదే ప్రభుదేవాతో దేవి 2 చిత్రంలో నటించింది. ఇది నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.

ప్రస్తుతం విశాల్‌తో సుందర్‌.సీ దర్శకత్వంలో చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ఈ చిత్రం తరువాత మరో చిత్రంలోనూ విశాల్‌తో రొమాన్స్‌ చేయడానికి తమన్నా ఓకే చెప్పేసినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా మరో అవకాశం ఈ బ్యూటీ తలుపులు తట్టినట్లు సమాచారం. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఆనందోబ్రహ్మ  చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.

తెలుగులో నటి తాప్సీ నటించిన పాత్రను తమన్నా పోషించబోతున్నట్లు సమాచారం. చిన్న చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఆనందోబ్రహ్మ. దీనికి దర్శకుడు మహి వీ.రాఘవ్‌. ఈయన ఆ తరువాత మమ్ముట్టి హీరోగా ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఇతివృత్తంతో యాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం విజయవంతం అవడంతో పాటు దర్శకుడికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఇప్పుడు ఆయన ఆనందోబ్రహ్మ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి సంకల్పించినట్లు, ఇందులో తమన్నాను కథానాయకిగా నటింపజేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది హర్రర్‌ కథా చిత్రమే కావడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా