భారీగా రెమ్యూనరేషన్ కట్‌!

13 Oct, 2017 20:41 IST|Sakshi

సాక్షి, తమిళ సినిమా: దీపం ఉండగానే ఇల్లు చక్కకబెట్టుకోవాలన్న పాలసీని తు.చ తప్పకుండా పాటించే హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నటిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో ఇంచుమించు స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది. దీనికి తగ్గట్టే పాపులారిటీ ఉండటంతో పారితోషికాన్ని కూడా భారీగా పెంచుకుంటూ పోయిందని కోలీవుడ్‌ టాక్‌. మధ్యలో అవకాశాలు కొరవడ్డా 'బాహుబలి'తో మరోసారి విజృంభించింది తమన్నా.. ఆ క్రేజ్‌ను వాడుకోవడానికి పారితోషికాన్ని రూ.కోటి వరకూ పెంచేసిందట. దీంతో అవకాశాలు మళ్లీ తగ్గాయనే సినీ జనాలు అంటున్నారు. ఆ మధ్య హిందీ చిత్రం 'క్వీన్‌' దక్షిణాది భాషల రీమేక్‌లో నటించడానికి తమన్నాను సంప్రదించగా దర్శక నిర్మాతలను కళ్లు తిరిగే పారితోషికం డిమాండ్‌ చేసిందనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం తెలుగు 'క్వీన్‌'లో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తమన్నాకు అవకాశాలు తగ్గడానికి కారణం ఇదీ ఒక కారణం కాగా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటం మరో కారణం.. ఏదేమైనా పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించిన ఈ బ్యూటీ ఒక మెట్టు దిగొచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకుందని, దీంతో మళ్లీ ఆమెకు అవకాశాలు తలుపుతడుతున్నాయని సమాచారం. ఇంతకుముందు చిత్రానికి కోటి రూపాయల వరకూ, సింగిల్‌ స్పెషల్‌ సాంగ్‌కు రూ. 60 లక్షల వరకు పుచ్చుకున్న తమన్నా.. ఇప్పుడు పారితోషికం విషయంలో పట్టువిడుపులు పాటిస్తున్నట్లు సినీవర్గాల్లో వినిపిస్తోంది.

తమన్నా చేతిలో ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ చిత్రాలు రెండేసి ఉన్నాయి. వీటిలో విక్రమ్‌తో రొమాన్స్‌ చేస్తున్న 'స్కెచ్‌' చిత్రం మినహా ఏ ఒక్క చిత్రంలోనూ స్టార్‌ హీరో లేరన్నది గమనార్హం. మరో విషయం ఏమిటంటే ముందుగా 'క్వీన్‌'  దక్షిణాది రీమేక్‌లో నటించడానికి భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేసిన తమన్నా.. ఇప్పుడు తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్ర ఇతర భాషల్లో వేర్వేరు నటీమణులు నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా