మాజీ ప్రేమికుల క్రేజీ తమాషా

24 Nov, 2015 03:54 IST|Sakshi
మాజీ ప్రేమికుల క్రేజీ తమాషా

అసలే రణ్‌బీర్ కపూర్ - దీపికా పదుకొనేలది హిట్ కాంబినేషన్.
దానికి తోడు ఈ మాజీ లవర్స్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తుంది.
అందుకే ‘తమాషా’ సినిమా పై బాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ నెలకొంది.
ఈ నెల 27 నుంచి వెండితెరపై తమాషా చూపనున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు...

 
* ఈ చిత్రానికి ముందు ‘విండో సీట్’ అనే టైటిల్ అనుకున్నారు. ఫైనల్‌గా ‘తమాషా’ అని పెట్టారు.

* ‘బచ్‌నా ఏ హసీనో’, ‘ఏ జవానీ హై దీవాని’ చిత్రాల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనేల కెమిస్ట్రీకి చాలా ప్రశంసలొచ్చాయి. ‘బచ్‌నా ఏ హసీనా’ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. అయితే ఎంతోకాలం వీళ్ల ప్రేమ సాగలేదు. బ్రేకప్ చెప్పేసుకున్నారు. వ్యక్తిగత జీవితానికీ, వృత్తి జీవితానికీ సంబంధం లేదంటూ, ‘ఏ జవానీ హై దీవానీ’లో కలిసి నటించారు.

* ఈ చిత్రకథలో ఇంతియాజ్ అలీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విశేషాలు ఉంటాయట. అయితే ఇది తన స్వీయ చరిత్ర కాదని ఇంతియాజ్ అంటున్నారు. మూడేళ్ల క్రితం ఆయన తన భార్య నుంచి విడిపోయారు. ఈ చిత్రంలో కూడా హీరో, హీరోయిన్ ఓ సందర్భంలో విడిపోతారట. జీవితంలో స్త్రీ ఎంత ముఖ్యం అనే అంశం మీద ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది.

* రణ్‌బీర్, దీపికలు మాజీ లవర్స్ కాబట్టి, వాళ్లతో సినిమా తీస్తే క్రేజ్ ఉంటుందని భావించే ఇంతియాజ్ ఈ జంటను ఎంపిక చేశారని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. ఈ ప్రచారం నిజం కాదని ఇంతియాజ్ అన్నారు. ఈ కథ రాసుకున్నాక ‘వేద్’ పాత్రలో రణ్‌బీర్,  ‘తార’గా దీపిక మాత్రమే కనిపించారని చెప్పారు.

* ఇంతియాజ్ దర్శకత్వంలో  రణ్‌బీర్ ‘రాక్‌స్టార్’ చిత్రంలో నటిస్తే, దీపికా ‘లవ్ ఆజ్ కల్’, ‘కాక్‌టైల్’ చిత్రాల్లో నటించారు. ఆ విధంగా ఇద్దరికీ ఇంతియాజ్‌తో మంచి అనుబంధం ఉంది. ‘తమాషా’ కథ నచ్చడంతో పాటు ఇంతియాజ్‌తో ఉన్న అనుబంధం కూడా ఈ ఇద్దరూ ‘తమాషా’కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఓ కారణం.

* వేద్ వర్థన్ అనే కుర్రాడు, తారా మహేశ్వరి అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ‘‘పెద్దయ్యాక అదవ్వాలి.. ఇదవ్వాలి’ అంటూ కుటుంబ సభ్యులు చేసే ఒత్తిడికి తనేం కావాలో, తనకేం కావాలో తెలియక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయి, కుంగిపోతాడు వేద్. అతన్ని ప్రోత్సహించి, అతని సత్తా ఏంటో తెలుసుకునేలా చేస్తుంది తార. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.

* ఈ చిత్రం షూటింగ్ అంతా ఓ పిక్నిక్‌లా జరిగిందట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి ఏమేం కావాలో మొత్తం యూనిట్ సభ్యులందరూ చర్చించుకునేవారు. విదేశాల్లో షూటింగ్ జరిగినప్పుడు  ఎవరెవరికి ఏమేం కావాలో రణ్‌బీర్, దీపికా ఓ పేపర్ మీద రాసుకుని, ఆర్డర్ చేసేవాళ్లట. చిత్రబృందం మొత్తం ఒకేచోట భోజనం చేసేవాళ్లు. దీనికోసం లొకేషన్‌లో పెద్ద భోజనం బల్ల ఏర్పాటు చేశారట.

* తమాషా ఏంటంటే.. ఈ మధ్యకాలంలో ఏ చిత్రాన్నీ ప్రమోట్ చేయనంతగా రణ్‌బీర్, దీపికా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మాత్రమే కాదు.. జాయింట్‌గా కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పబ్లిక్‌లో చాట్ బండార్ దగ్గర కలిసి పానీపూరీలు తిని, తమాషా చేస్తున్నారు. ప్రమోషనల్ కార్యక్రమాల కోసం ట్రైన్‌లో ఢిల్లీ వెళ్లారు. ఈ ఇద్దరి వ్యవహారం చూసి, ‘మళ్లీ లవ్‌లో పడినట్లున్నారు’ అని కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంచెం ఓవర్‌గానే పబ్లిసిటీ చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. ఏదేతైనేం సినిమాకి కావల్సినంత ప్రచారం వచ్చేసింది.

* ఈ చిత్రం కోసం రొమాంటిక్ సాంగ్స్ తీసినప్పుడు రణ్‌బీర్, దీపికా బాగా లీనమైపోయేవారట. ఆలింగనం చేసుకునే సన్నివేశాల్లో అయితే షాట్ ఓకే అనిపించి, ఇంతియాజ్ ‘కట్’ చెప్పినా విడిపోయేవాళ్లు కాదట. కాసేపు అలానే ఉండి, సీన్ బాగా చేసినందుకు ఇద్దరూ భేష్ అనుకుంటూ భుజాలు తట్టుకునేవాళ్లట.

* ఈ చిత్రం ఫొటోల్లో రణ్‌బీర్, దీపికాల మధ్య కెమిస్ట్రీ చూసి ‘అదిరిపోయింది’ అంటున్నారు. ప్రమోషనల్ కార్యక్రమాల్లో హగ్గులు, కిస్సులు చేసుకోవడం చూసి, సినిమాలో ఓ రేంజ్‌లో కెమిస్ట్రీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కుర్రకారు ‘తమాషా’ చూసే తీరాలనుకుంటున్నారు. దాదాపు 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సాజిద్ నడియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కూడా భారీ వసూళ్లు కురిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
      
* ఇప్పటివరకు వచ్చిన హిందీ చిత్రాల్లో పొడవాటి ముద్దు సీన్ ఉన్న చిత్రం ఇదేనని సెన్సార్ సభ్యులు అన్నారట. ఈ చిత్రం నిడివి రెండు గంటల 19 నిమిషాలు.