తెరపైకి చంద్రబాబు బయోపిక్‌

12 Dec, 2018 10:30 IST|Sakshi
దర్శకుడు కే.రాజేశ్వర్‌ ,హాస్యనటుడు చంద్రబాబు

సినిమా: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోందని చెప్పవచ్చు. తెలుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ బయోపిక్‌లు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని త్వరలో వెండితెరపైకి రానున్నాయి. అయితే అదేవిధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత జీవిత చరిత్రలు చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. ఆ తరంలో నటుడిగా రాణించిన మరో తమిళ నటుడు చంద్రబాబు. ఈయన కథానాయకుడిగా, హాస్యనటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో మరువలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన 1950 నుంచి 1970 వరకూ తమిళసినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. అలాంటి నటుడి బయోపిక్‌ జేపీ. ది లెజెండ్‌ ఆఫ్‌ చంద్రబాబు పేరుతో సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అదే పేరుతో సీనియర్‌ దర్శకుడు కే.రాజేశ్వర్‌ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇంతకు ముందు అమరన్, ఇదయతారై, కోవిల్‌పట్టి వీరలక్ష్మి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన కే.రాజేశ్వర్‌ పలు హిందీ చిత్రాలకు కథలను అందించారు. ఈయన తాజాగా జేపీ. ది లెజెండ్‌ ఆఫ్‌ చంద్రబాబు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చంద్రబాబు పాత్రలో నటించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ చిత్రంలో ఎంజీఆర్, శివాజీగణేశన్, జెమినీగణేశన్, సావిత్రి, కన్నదాసన్, ఎంఎస్‌.విశ్వనాథన్‌ వంటి నాటి ప్రఖ్యాత నటీనటులతో పాటు, అప్పటి రాజకీయనాయకుడు కామరాజ్‌ వంటి వారి పాత్రలు కూడా చోటుచేసుకుంటాయని తెలిపారు. దీన్ని ఇండో రష్యా సంయుక్త సంస్థ అయిన రురో ఇంటర్నేషనల్‌ పతాకంపై రష్యాతంగప్పన్, కే.రాజేశ్వర్, ఆర్‌వీ.స్వామినాథన్‌లతో పాటు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తరఫున నటి కుట్టిపద్మిని నిర్వహణ బాధ్యతలను నిర్వహించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు