కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

31 Jul, 2019 08:35 IST|Sakshi

తమిళసినిమా: కోమాలి చిత్రంలో కావాల్సినంత రొమాన్స్‌ ఉంటుందంటున్నారు ఆ చిత్ర కథానాయకుడు జయంరవి. జయం చిత్రంతో కథానాయకుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన ఆ చిత్రం పేరునే తన పేరుకు ముందు చేర్చుకుని తన విజయ పయనాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అలా 24 చిత్రాలు పూర్తి చేశారు. 24వ చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం కోమాలి. కాజల్‌అగర్వాల్, సంయుక్తహెగ్డేలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ పరిచయం అవుతున్నారు. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరిగణేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా కోమాలి చిత్ర కథానాయకుడు జయంరవితో సాక్షీ భేటి అయింది.

ప్ర:  కోమాలి చిత్రం కథ గురించి వివరించండి?
:  కోమలి చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ఇది నాగరికత చెందుతున్న మనిషి జీవన విధానం గురించి ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుంది. సుమారు 20 ఏళ్ల క్రితం భవిష్యత్‌లో నీళ్లను బాటిల్‌లో విక్రయించే రోజు వస్తుందంటే ఎవరూ నమ్మేవారు కాదు. అలాంటి విషయాల గురించి మాట్లాడే ఒక యువకుడిని జోకర్‌గా చూసేవారు. ఆ యువకుడి ఇతి వృత్తంతో సాగే కథా చిత్రమే కోమలి. ఇది రాతి యుగం నుంచి కాలం ఎలా మారుతూ ఆధునిక యుగంగా రూపాంతం చెందిందన్న పలు విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుంది.

ప్ర: చిత్రంలో మీరు చాలా గెటప్‌లలో కనిపించనున్నట్లున్నారు?
జ: అవును. ఇందులో చాలా గెటప్‌లలో కనిపిస్తాను. అందులో నాలుగు గెటప్‌లకు కథలో ప్రాధాన్యత ఉంటుంది. మిగిలినవి రాతి యుగం నుంచి మనిషి ఎలా రూపాంతం చెందాడన్నది చూపడానికి ఉపయోగించాం. నాలుగు గెటప్‌లలో విద్యార్థి దశలోని పాత్ర చిత్రంలో సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఆ పాత్ర కోసం మారడానికి చాలా కసరత్తులు చేయాల్సి వచ్చింది. ముందు విద్యార్థిగా వేరే నటుడితో నటింపజేద్దామని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే వేరే నటుడైతే సహజంగా ఉండదని నేనే విద్యార్థిగానూ నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు చాలా బరువు తగ్గాల్సి వచ్చింది.

ప్ర: ఇలా బరువు పెరగడం, తగ్గడం కష్టం అనిపించడం లేదా?
జ:  చాలా కష్టం. అయితే ఇప్పుడు ప్రేక్షకులు మామూలుగా లేరు. వారికి నచ్చకపోతే ఎలాంటి చిత్రాన్నైనా పక్కన పెట్టేస్తున్నారు. సో వారిని సంతృప్తి పరచడానికి మేము శ్రమించక తప్పదు. అంతే కాకుండా కొత్తదనాన్ని నేనూ కోరుకుంటాను. ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తాను. ఇదే మా నాన్న నాకు చెప్పారు.

ప్ర:  కోమాలి చిత్రంలో ప్రత్యేకతలేంటి?
జ: చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్రంలో విద్యార్థి దశ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇక పలు గెటప్‌లు. వీటితో పాటు చెన్నై 2015లో ఎదుర్కొన్న వరద సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సెట్‌ వేయడానికి 10 మందికి పైగా ప్రముఖ కళాదర్శకులను సంప్రదించి, నాటి వరదలను కళ్లకు కట్టినట్లు సెట్‌ వేసి సన్నివేశాలను రూపొందించాం.

ప్ర: హీరోయిన్‌గా నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేయడానికి కారణం?
జ: కొత్త కాంబినేషన్‌ బాగుంటుందనే. నిజం చెప్పాలంటే ఇంతకు ముందే మా కాంబినేషన్‌లో చిత్రం రావాల్సింది. అలా రెండు సార్లు అనివార్యకారణాల వల్ల అది సెట్‌ కాలేదు. ఈ చిత్రం కోసం కాజల్‌అగర్వాల్‌ను అడిగినప్పుడు నటిస్తానని చెప్పారు. నిజానికి ఇందులో ఆమె పాత్ర పరిది తక్కువగానే ఉంటుంది. కథ నచ్చడంతో మంచి కథా చిత్రంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నానని తను నటించడానికి అంగీకరించారు. ఇందులో మరో హీరోయిన్‌గా సంయుక్తాహెగ్డే నటించారు.

ప్ర:  ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి రొమాన్స్‌ సన్నివేశాలు బాగానే ఉంటాయని భావించవచ్చా?
జ: కోమలి చిత్రంలో కావాల్సినంత రొమాన్స్‌ ఉంటుంది. మరో విషయం ఏమిటంటే సాధారణంగా చిత్రాల్లో ఒక సన్నివేశంలో సెంటిమెంట్, మరో సన్నివేశంలో రొమాన్స్, ఇంకో సన్నివేశంలో వినోదం ఉంటాయి, అయితే కోమాలి చిత్రంలో ప్రతి సన్నివేÔ¶ ంలోనూ రోమాన్స్, కామెడీ, సెంటిమెంట్‌ వంటి అంశాలు చోటు చేసుకుంటాయి. ఇదే ఈ చిత్రంలో హైలైట్‌. అందుకే నాకీ చిత్రం ప్రత్యేకం.

ప్ర: మీ వారసుడు ఆరవ్‌ను టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం చేశారు. ఆ తరువాత మరే చిత్రంలోనూ ఆరవ్‌ నటించలేదే?
జ: నిజం చెప్పాలంటే ఆరవ్‌ ఆ చిత్రం తరువాత 25 చిత్రాల అవకాశాలు వచ్చాయి. చదువు పాడవుతుందని ఆ అవకాశాలను అంగీకరించలేదు. ఇప్పుడు ఆరవ్‌కు 9 ఏళ్లు. మరో 10 ఏళ్లలో హీరో అయిపోతాడు.

ప్ర: ఆరవ్‌ హీరోగా పరిచయం అయ్యే చిత్రానికి మీరే దర్శకత్వం వహిస్తానని ఇంతకు ముందు అన్నారు. అదే జరుగుతుందా?
జ: నేను దర్శకత్వం చేద్దాం అనుకున్నాను కానీ దర్శకుడు శక్తిశరవణన్‌ ఆరవ్‌ తొలి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వాలని నాతో ప్రామిస్‌ చేయించారు.
 

ప్ర: సరే మీరు దర్శకత్వం వహించేదెప్పుడు?
జ:  అందుకు 3 కథలను సిద్ధం చేసుకున్నాను. అయితే దర్వకత్వం చేపట్టడానికి ఇంకా టైమ్‌ పడుతుంది.

ప్ర: మీ సోదరుడు మోహన్‌రాజాతో తనీఒరువన్‌ 2 చేస్తానన్నారు. అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
జ:  అన్నయ్య తనీఒరువన్‌ 2 చిత్ర కథను తయారు చేసే పనిలోనే ఉన్నారు. కథ దాదాపు పూర్తయింది. అయితే నేను ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో అన్నయ్యనే ఆ చిత్రాలు పూర్తి చేయ్యి ఆ తరువాత మనం కలిసి తనీఒరువన్‌ 2 చేద్దాం అని చెప్పారు.
 

ప్ర:  మీరు నటించిన హిట్‌ చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యి సరైన ప్రమోషన్‌ లేక ప్రేక్షకులను రీచ్‌ అవ్వలేకపోతున్నాయి. కొన్ని చిత్రాలయితే ఛానళ్లకే పరిమితం అవుతున్నాయన్నది తెలుసా?
జ: నిజమే. ఈ విషయం నా దృష్టికీ వచ్చింది.  నేను నటించిన అడంగుమరు చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటే తెలుగులో  నా పాత్రను పోషించే నటుడు లేరని చెప్పారు. దీంతో ఆ చిత్రాన్ని అనువాదంగానే విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే గత చిత్రాల మాదిరిగా కాకుండా  బాగా ప్రమోట్‌ చేసే నిర్మాత దిల్‌రాజుకు ఆ బాధ్యతలను అప్పగించడానికి చర్చలు జరుగుతున్నాయి.

ప్ర: చివరిగా ఒక ప్రశ్న. మీరు తెలుగులో నటించే అవకాశం ఉందా?
జ: చెయ్యాలండీ. చాలా మంది అడుగుతున్నారు. కచ్చితంగా తెలుగులో చిత్రం చేస్తాను.
 

మరిన్ని వార్తలు