8 Mar, 2018 10:36 IST|Sakshi

తమిళసినిమా: హాస్యనటుడు వివేక్‌కు కథానాయకుడిగా రాణించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అలా ఒకటి రెండు చిత్రాల్లో నటించినా నాన్‌దా బాలా అనే ఒక్క చిత్రం మాత్రమే తెరపైకి వచ్చినా, అదీ ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ఎళుమిన్‌ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వివేక్‌కు భార్యగా నటి దేవయాని నటిస్తున్నారు. వీరితో పాటు ప్రవీణ్, శ్రీజిత్, వినీత్, సుఖేశ్, కీర్తిక, దీపిక, అళగం పెరుమాళ్, ప్రేమ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు వీపీ.విజీ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైఎం మీడియాస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ జగదీశ్వరన్‌ ఛాయాగ్రహణం, సంగీతాన్ని గణేశ్‌ చంద్రశేఖర్‌ అందిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు వీపీ.విజీ తెలుపుతూ ఆత్మరక్షణ విద్యలపై ఆసక్తి కలిగిన ఐదుగురు చిన్నారులు ఆ విద్యల్లో ఘనత సాధించడమే ఎళుమిన్‌ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. విశ్వనాథన్‌ అనే వ్యక్తి కొడుకు అర్జున్‌ మరో ఐదుగురు పిల్లలు మంచి స్నేహితులని, ఈ పిల్లలు ఆత్మరక్షణ విద్యలు కుంగ్‌ఫూ, కరాటే, బాక్సింగ్, కర్రసాముల్లో శిక్షణ పొందుతారన్నారు.

అయితే ఆర్థిక స్తోమత లేని ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రుల నుంచే ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. అలాంటి సమయంలో అర్జున్‌ తల్లిదండ్రులు వారికి అండగా నిలుస్తారని తెలిపారు. ఇందులో విశ్వనాథన్‌గా నటుడు వివేక్, ఆయన భార్యగా దేవయాని నటిస్తున్నారని చెప్పారు. ఈ ఐదుగురు పిల్లలు జీవితంలో ఎదురయ్యే  ఆటంకాలను, పరిస్థితుల ప్రభావాలను అధిగమించి వారి లక్ష్యాన్ని ఎలా సాధించారన్నదే ఎళుమిన్‌ చిత్ర కథ అని తెలిపారు. ఇందులో రిస్కీ ఫైట్స్‌ సన్నివేశాల్లో కూడా చిన్నారులు అద్భుతంగా నటించారని చెప్పారు. వీరి నిజ జీవితంలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొందారని దర్శకుడు తెలిపారు.

మరిన్ని వార్తలు