చీపురు పట్టిన సినీ తారలు

12 Dec, 2015 09:37 IST|Sakshi
చీపురు పట్టిన సినీ తారలు

చెన్నై : సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోలమే అనిపించుకుంటున్నారు. మన నటీమణులు. ఇటీవల తుపాన్ తమిళ ప్రజలను నిలువనీడ కూడా చేసి కనీవినీ ఎరుగని కష్టనష్టాలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి మన సినీ తారల్ని కలచి వేసింది. ఆదుకోవడానికి మేము సైతం అంటూ ప్రజల ముందుకు వచ్చారు. తుపాన్ నివారణకు విరాళాలను అందిస్తున్నారు. అంతటితో ఆగలేదు వారి చేయూత పలు సహాయ కార్యక్రమాలతో అన్నార్థులను ఆదుకుంటున్నారు.
 
తాజాగా చెన్నై నగరాన్ని శుద్ధి చేయడానికి చీపుర్లు పట్టారు. సింగార చెన్నైగా పేరు గాంచిన చెన్నై నగరాన్ని తుపాన్ దుర్భరంగా మార్చేసింది. చెత్త చెదారంతో దుర్వాసనలతో నిండిపోయింది. అలాంటి నగరాన్ని శుద్ధి చేయడానికి సినీ తారలు చీపుర్లు పట్టడానికి కూడా వెనుకాడలేదు. నెక్ట్స్ స్టెప్ ఫౌండేషన్ సంస్థతో కలిసి నగరంలోని చెత్తా చెదారాన్ని ఊడ్చేయడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం చెన్నై ఎగ్మూర్ గంగిరెడ్డి వీధిలోని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు.
 
ఇందులో నడిగర్ సంఘం కోశాధికారి కార్తీతో పాటు నటుడు ఆర్.రితీష్, ఉదయ, నటి వరలక్ష్మి, లలితకుమారి, శ్రీమాన్ మహేంద్రన్, సౌందరరాజన్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. పరిశుభ్ర పరిచిన ప్రాంతాల్లో వైద్యబృందం ప్రజలకు రోగ నివారణ వైద్యసేవలను అందించారు. నగరాన్ని శుద్ధి పరిచే కార్యక్రమంలో 25 మందికి పైగా పాల్గొన్నారు. తదుపరి పుదుపేట ప్రాంతాన్ని శుభ్రపరిచారు.

>