హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు

20 Feb, 2017 16:25 IST|Sakshi
హీరో కూతురికీ తప్పని లైంగిక వేధింపులు
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణల కేసు సృష్టించిన సంచలనం ఇంకా వీడిపోక ముందే మరో తమిళ నటి తనపై ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టి సంచలనం సృష్టించారు. తమిళంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె, స్వయంగా హీరోయిన్ కూడా అయిన వరలక్ష్మి తనపై చోటుచేసుకున్న వేధింపుల విషయాన్ని వెల్లడించారు. తాను ఇటీవల ఒక టీవీ చానల్‌కు వెళ్లినప్పుడు అక్కడి ప్రోగ్రాం హెడ్ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో అక్కడినుంచి బయటకు వచ్చేశానన్నారు. అతడు దారుణంగా మాట్లాడాడని, తనను వేధించాడని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిత్రసీమలో హీరోయిన్లపై కూడా వేధింపులు వెలుగు చూడటం దారుణంగా ఉందని తెలిపారు. ట్విట్టర్‌లో ఈ అంశంపై ఆమె ఒక భారీ లేఖ పోస్ట్ చేశారు. (వరలక్ష్మి లేఖ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి)
 
అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందని, మహిళల భద్రత అనేది జోక్‌గా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. ఈ వెధవలను ఉరి తీయాలన్నారు. మళయాళ నటికి మద్దతు పలుకుతున్నానని, వాళ్లకు శిక్ష పడి తీరుతుందని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ పెట్టిన సందర్భంలోనే ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని కూడా ఒక భారీ లేఖ రూపంలో ట్వీట్ చేశారు.  ఈ విషయాన్ని బయట పెట్టాలా వద్దా అని రెండు రోజులుగా మధనపడుతున్నానని, చివరకు చెప్పి తీరాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ రాస్తున్నానని అన్నారు.