నోరు జారారు.. బయటకు పంపారు

8 Aug, 2019 07:12 IST|Sakshi

చెన్నై ,పెరంబూరు: ఎవరన్నారండీ స్త్రీని అబల అని. ఆమె అబల కాదు. పవర్‌. టచ్‌ చేసి చూడు.మటాషే. ఏంటీ ఇంకా స్త్రీ అబల కాదంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎప్పుడో ఏ అమ్మాయిలనో టచ్‌ చేసిన ప్రముఖ సినీ నటుడికి అప్పుడు ఎలాంటి అపరాధం కానీ, అవమానం కానీ జరగలేదు. అయితే అది వెంటాడుతుందన్న విషయం తనకే తెలియలేదు. అయితే తన నోట దురుసు కారణంగానే అప్పటి తప్పునకు ఇప్పుడు ఫలితాన్ని అనుభవించాడు. అలా నోరుజారాడు తమిళ నటుడు శరవణన్‌. దీని మూలాలలోకి వెళితే కారణం నటుడు కమలహాసనే అవుతారు.

ఆయన వ్యాఖ్యాతగా ఒక ప్రైవేట్‌ చానల్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో సీజన్‌ 3లో పాల్గొన్న వారిలో నటుడు శరవణన్‌ ఒకరు. బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులతో ప్రతి శని, ఆదివారాల్లో వ్యాఖ్యాత అయిన కమలహాసన్‌ ముచ్చటిస్తుంటారు. అలా ఇటీవల బిగ్‌బాస్‌ హౌస్‌లో పాల్గొన్న దర్శకుడు చేరన్‌ ఒక టాస్క్‌లో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మరో సభ్యురాలు నటి మీరా మిథున్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఈ సంఘటన గురించి చర్చ వచ్చినప్పుడు కమలహాసన్‌.. చేరన్‌కు మద్దతుగా నిలవడమే కాకుండా, నటి మీరామిథున్‌ను తప్పు పట్టారు.

నటుడు శరవణన్‌
అంతటితో ఆగలేదు. అలాంటి సంఘటనలకు నిజ జీవితంలో ఎవరైనా పాల్పడ్డారా? అని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను ప్రశ్నించారు. దీంతో నటుడు శరవణన్‌ లేచి తాను కళాశాలలో చదువుతున్నప్పుడు బస్సులో అమ్మాయిలను టచ్‌ చేసేవాడినని చెప్పాడు. ఆయన మాటలకు కమలహాసన్‌తో పాటు ఇంటి సభ్యులు నవ్వుకున్నా, బాహ్య ప్రపంచంలో శరవణన్‌ మాటలు తీవ్ర ప్రభావాన్నే చూపాయి. శరవణన్‌ మాటలకు మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక ఇలాంటి విషయాలపై వెంటనే స్పందించే సంచలన గాయని, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయి తీవ్రంగా ఖండించారు. 

స్త్రీలను బలవంతం చేయడానికే నేను బస్సులో ప్రయాణం చేసేవాడిని అని శరవణన్‌ చెప్పారని, ఇది ప్రేక్షకులకూ, మహిళలకు హాస్యంగా అనిపించిందని, నిజానికి ఆయన మాటలు చాలా హీనంగా ఉన్నాయని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో నటుడు సరవణన్‌ క్షమాపణ చెప్పక తప్పలేదు. అయితే జరగాల్సిందేదో అప్పటికే జరిగిపోయ్యింది. దీనికి తోడు నటుడు శరవణన్, మరో సభ్యుడు దర్శకుడు చేరన్‌ కించపరచే విధంగా మాట్లాడాడు. దీన్ని కమలహాసన్‌ తప్పు పట్టారు.

ఏతా వాతా శరవణన్‌ నోరు జారడంతో ప్రేక్షకులు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి అర్ధంతరంగా బయటకు పంపించేశారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే నటుడు శరవణన్‌ను బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు పంపడంతో ఇతర సభ్యులందరూ, ఆయనకు ఏం జరిగిందో, తన కుటుంబానికి ఏమైనా జరిగిందా? అంటూ తెగ ఏడ్చేశారు. అసలు నిజం తెలిస్తే వారు అంతగా ఇదైపోయి ఉండేవారు కాదేమో. ఏదేమైనా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కౌంట్‌ అవుతుందని అది ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడైనా తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తుందనీ ఈ సంఘటనలో దాగున్న నీతి. 

మరిన్ని వార్తలు