16 నుంచి థియేటర్లకు తాళం

10 Mar, 2018 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తమిళసినిమా: ఈ నెల 16వ తేదీ నుంచి తమిళనాడులోని అన్ని థియేటర్లలో ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు థియేటర్ల యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే దక్షిణాది నిర్మాతలకు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌కు మధ్య రేట్లు తగ్గించాలన్న విషయంపై  చర్చలు విఫలం కావడంతో మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను విడుదలను నిలిపేశారు. ఈ వ్యవహారంలో తెలుగు చిత్ర నిర్మాతలకు, డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి.

దీంతో అక్కడి నిర్మాతలు కొత్త సినిమాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే తమిళ నిర్మాతలు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం తమిళనాడు థియేటర్ల సంఘం నిర్వాహకులు చెన్నైలోని రోహిణి థియేటర్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. సంఘం కార్యదర్శి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి ఇచ్చిన హామీలను వారంలోగా నెరవేర్చాలని లేనిపక్షంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రదర్శనలను నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం విధిస్తున్న వినోదపు పన్ను 8శాతాన్ని పూర్తిగా రద్దు చేయాలి. థియేటర్ల నిర్వహణ చార్జీలను ఏసీ థియేటర్లకు ఒక్క రూపాయి నుంచి రూ.5వరకూ, నాన్‌ ఏసీ థియేటర్లకు 50పైసల నుంచి రూ.3వరకూ పెంచేందుకు అనుమతించాలని, థియేటర్ల లైసెన్స్‌ మూడేళ్లకోసారి రెన్యూవల్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాలి తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇలా ఉండగా నిర్మాతల మండలి నిర్ణయంతో తమకు ఎలాంటి సమస్యలేదని, ప్రభుత్వం విధిస్తున్న 8శాతం వినోదపు పన్ను కారణంగానే నష్టపోతున్నామని  థియేటర్ల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 16వ తేదీ నుంచి చిత్రాల షూటింగ్‌ను సైతం రద్దు చేస్తున్నట్టు నిర్మాతల మండలి నిర్ణయించింది.

మరిన్ని వార్తలు