దర్శకుడు మహేంద్రన్‌ కన్నుమూత

3 Apr, 2019 02:34 IST|Sakshi
జె. మహేంద్రన్, నివాళులర్పిస్తున్న రజనీకాంత్‌

కోలీవుడ్‌ సినీదర్శక దిగ్గజాల్లో ఒకరైన జె. మహేంద్రన్‌ మంగళవారం కన్నుమూశారు. నటుడు కూడా అయిన మహేంద్రన్‌ గతనెల విడుదలైన తమిళ చిత్రం ‘బూమరాంగ్‌’లో ఓ పాత్ర చేశారు. అలా కొన్ని చిత్రాల్లో నటించిన మహేంద్రన్‌ ఆనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 79 ఏళ్లు. నటుడు కమలహాసన్‌ ప్రోత్సాహంతో దర్శకుడయిన ఈయన రజనీకాంత్‌లోని నటుడిని వెలికి తీసిన దర్శకుడిగా వాసికెక్కారు.

తమిⶠసినిమా గర్వించదగ్గ చిత్రాలను రూపొందించిన దర్శకుడు మహేంద్రన్‌. దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ మెచ్చిప దర్శకుడీయన. ఆయన ప్రోత్సాహంతోనే సినీ రంగప్రవేశం చేసిన మహేంద్రన్‌ స్వగ్రామం శివగంగై జిల్లాలోని ఇళైయాన్‌గుడి. ఈయన అసలు పేరు జే. అలెగ్జాండర్‌. 1939 జూలై 25న జోసఫ్‌ సెల్లయ్య,మనోన్మణి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత ఊరులోనే అభ్యసించిన ఈయన ఉన్నత చదువును మధురైలోని అమెరికన్‌ కళాశాలలో చదివారు.

కారైక్కుడిలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ కళాశాల వార్షికోత్సవ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంజీఆర్‌ హాజరయ్యారు. ఆ వేదికపై మహేంద్రన్‌ వాక్చాతుర్యాన్ని, పత్రిభను  ఎంజీఆర్‌ ప్రశంసించారు. ఆ తరువాత న్యాయవాది కోర్స్‌ చేయడానికి చెన్నై వెళ్లారు మహేంద్రన్‌. అయితే అది పూర్తి చేయకుండానే ‘ఇళముళక్కమ్‌’ అనే సినిమా పత్రికలో విమర్శకుడిగా చేరారు. కాగా సినిమాలకు దూరంగా ఉన్న ఎంజీఆర్‌ మళ్లీ నటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి మహేంద్రన్‌ వెళ్లారు.

అప్పుడు ఎంజీఆర్‌ ఆయన్ని గమనించి లాయడ్స్‌ రోడ్డులో గల తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మహేంద్రన్‌ ఆయన ఇంటికి వెళ్లగా తాను నటించాలని ఆశించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవలను ఇచ్చి దానికి కథనాన్ని తయారు చేయమని పురమాయించారు. ఆ తర్వాత తన నాటక సంఘం కోసం దాన్ని నాటకంగా తీర్చిదిద్దమని చెప్పడంతో అదీ సిద్ధం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అవి రెండూ జరగలేదు. ఆ తరువాత మహేంద్రన్‌ ఎంజీఆర్‌ ద్వారా బాలన్‌ మూవీస్‌ సంస్థ అధినేత నిర్మించిన ‘నామ్‌ మూవర్‌’చిత్రానికి కథను అందించారు.

అందులో జయశంకర్, రవిచంద్రన్, నాగేశ్‌లు నటించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో మహేంద్రన్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ‘శభాష్‌ తంబి, పణక్కార పిళ్లై, నిరైకుడమ్, తిరుడి, తంగపతకం, ఆడుపులి ఆట్టం వంటి పలు చిత్రాలకు కథ, కథనాలను అందించారు. మహేంద్రన్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ముల్లుమ్‌ మలరుమ్‌’. రజనీకాంత్, శరత్‌బాబు, పటాఫట్‌ జయలక్ష్మీ, శోభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది.

రజనీకాంత్‌ను నటుడిగా కొత్త మలుపు తిప్పిన చిత్రం ‘ముల్లుమ్‌ మలరుమ్‌’. ఆ తరువాత ‘ఉదిరిపూక్కళ్, పూట్టాద పూట్టుగళ్, జానీ, నెంజల్తై కిల్లాదే, మెట్టి, నండు, కన్నుక్కు మై ఎళుదు, అళగియ కన్నే, కై కొడుక్కుమ్‌ కై తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1992లో తెరకెక్కించిన ‘ఊర్‌ పంజాయత్తు’ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న మహేంద్రన్‌ ‘కలైజ్ఞర్‌’ (1999) అనే చిత్రానికి రచయితగా వ్యవహరించారు. మళ్లీ సినిమాలకు దూరమైన ఆయన 2004లో ‘కామరాజ్‌’ అనే చిత్రంలో నటుడిగా కనిపించారు.

2006లో తీసిన ‘సాసనం’ దర్శకుడిగా మహేంద్రన్‌కి చివరి సినిమా. విజయ్‌ హీరోగా అట్లీ తెరకెక్కించిన ‘తేరి’ చిత్రంలో ఓ పాత్ర చేసిన ఆయన రజనీకాంత్‌ ‘పేటా’లో కూడా నటించారు. ‘కాటమరాయుడు’ చిత్రంలోనూ నటించారు మహేంద్రన్‌.  ఆయన తనయుడు జాన్‌ మహేంద్రన్‌ తెలుగు చిత్రం ‘ప్రేమించేది ఎందుకమ్మా’కి దర్శకత్వం వహించడంతో పాటు దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్‌తో ‘నీతో’ చిత్రం తెరకెక్కించారు.

మహేంద్రన్‌ మరణంతో తమిళ చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మహేంద్రన్‌ భౌతికకాయాన్ని సందర్శించి రజనీకాంత్‌ కన్నీటి పర్యంతమయ్యారు. రజనీకాంత్‌తో ‘ముళ్లుమ్‌ మలరుమ్‌’ తర్వాత కాళీ, జానీ, కై కొడుక్కుమ్‌ కై వంటి సినిమాలు తీశారు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, కె.భాగ్యరాజా, సంగీతదర్శకుడు ఇళయరాజా, డీఎంకే నేత స్టాలిన్‌ తదితర సినీ, రాజకీయ రంగ ప్రముఖులు మహేంద్రన్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు.      
  – బి.నాగేశ్వరరావు, సాక్షి, చెన్నై

మరిన్ని వార్తలు