దర్శకుడు త్రిలోకచందర్ ఇక లేరు!

15 Jun, 2016 22:51 IST|Sakshi
దర్శకుడు త్రిలోకచందర్ ఇక లేరు!

నివాళి
 ఎన్టీయార్, ఎమ్జీయార్, శివాజీ గణేశన్, సూపర్‌స్టార్ కృష్ణ, రజనీకాంత్‌లతో పని చేసిన నిన్నటి తరం దర్శకుడు డాక్టర్ ఎ.సి. త్రిలోకచందర్ ఇక లేరు. ఆరు దశాబ్దాలుగా సినీ రంగంతో అనుబంధమున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఆర్కాట్ ప్రాంతానికి చెందిన త్రిలోకచందర్ పూర్తి పేరు - ఎ. చెంగల్వరాయ ముదలియార్ త్రిలోకచందర్. తమిళ, తెలుగు, హిందీల్లో 65 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
 
ఎ.వి.ఎం.తో అనుబంధం!
త్రిలోకచందర్ పేరు చెప్పగానే ఎన్టీయార్ ‘రాము’, ‘నాదీ ఆడజన్మే’, హీరో కృష్ణ ‘అవే కళ్ళు’ సహా పలు హిట్స్ గుర్తొస్తాయి. విద్యావంతులు సినిమాల్లోకి రావడమనే ధోరణికి తొలి ఆనవాళ్ళలో ఒకరు - త్రిలోకచందర్. ఆ రోజుల్లో ఎకనామిక్స్‌లో ఎం.ఏ చేసి, సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ, సినిమాల్లోకొచ్చారు.

షేక్స్‌పియర్ లాంటి ప్రసిద్ధుల రచనల తమిళ అనువాదాలు తల్లి ద్వారా చిన్న నాటే పరిచయమయ్యాయి. దాంతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగాయి. మిత్రుడైన నటుడు ఎస్.ఎ. అశోకన్ ద్వారా ఏ.వి.ఎం. అధినేత ఏ.వి. మెయ్యప్ప చెట్టియార్ కుమారుడు ఎం. శరవణన్‌తో జరిగిన పరిచయంతో త్రిలోక్ ప్రస్థానం మారిపోయింది. ఏ.వి.ఎం. కుటుంబంలో అందరితో ఆయనకు చివరి దాకా సాన్నిహిత్యం.  
 
తెలుగులో... ఇళయరాజా పరిచయకర్త!
దక్షిణాది సినీరంగంలో తొలితరం మార్గదర్శకులైన ఆర్. పద్మనాభన్, కె. రామనాథ్ లాంటి వారితో కలసి పనిచేసిన అరుదైన అనుభవం త్రిలోకచందర్‌ది. మొదట్లో ‘ఎ.సి.టి. చందర్’ అనే పేరుతో కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, ఆ పైన సహాయ దర్శకుడిగా ఆయన ప్రస్థానం సాగింది. ఎ.వి.ఎం ‘వీర తిరుమగన్’ (1962)తో దర్శకులయ్యారు. ‘మాయాబజార్’లో చిన్ననాటి శశిరేఖ పాత్ర దారిణి సచ్చుకి నాయికగా ఇదే తొలి చిత్రం. తమిళ నటుడు శివకుమార్ (హీరో సూర్య తండ్రి)ని ‘కాక్కుమ్ కరంగళ్’ ద్వారా పరిచయం చేసిందీ త్రిలోకే! ‘భద్రకాళి’(’77) ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఇళయరాజాకు తెలుగు తెరంగేట్రం చేసిందీ ఆయనే.
 
అటు శివాజీ... ఇటు ఎమ్జీయార్...
తమిళ రంగంలో రెండు భిన్న ధ్రువాలైన అగ్రనటులు శివాజీ గణేశన్, ఎమ్జీయార్‌లు - ఇద్దరితో పనిచేసిన ఘనత త్రిలోకచందర్‌ది. శివాజీతో 25 సినిమాలు రూపొందించారు. ఎ.వి.ఎం. సంస్థ ఎమ్జీయార్‌తో తీసిన ఒకే చిత్రం ‘అన్బే వా’కు త్రిలోకే దర్శకుడు.  
 
సాహిత్య ప్రభావంతో... ‘అవే కళ్ళు’!
బ్రిటీషు రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్ సృష్టించిన ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధనల తమిళ అనువాదాల్ని ఇష్టంగా విన్న, చదివిన అనుభవం త్రిలోకచందర్‌ది. చిన్నప్పటి ఆ డిటెక్టివ్ సాహిత్యపు పోకడల వల్లే ఆయన తెలుగులో కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్ళు’(’67) కథ సొంతంగా రాసుకొన్నట్లు కనిపిస్తుంది. అపరాధ పరిశోధన చిత్రాల్లో ఇవాళ్టికీ ‘అవే కళ్ళు’ ప్రత్యేకంగా నిలిచిందంటే అందుకు త్రిలోక్ ప్రతిభే కారణం.
 
ఎల్వీ ప్రసాద్‌కు ఏకలవ్య శిష్యుడు!
ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ‘ఆస్కార్’ అవార్డులకు మన దేశం పక్షాన ఎంట్రీగా వెళ్ళిన తొలి దక్షిణ భారత సినిమా ‘దైవ మగన్’ కూడా త్రిలోకచందర్ దర్శకత్వం వహించినదే! తెలుగు దర్శక - నిర్మాత ఎల్.వి. ప్రసాద్‌కి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకొ న్నారు. కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం - ఈ విభాగాల్ని బలంగా నమ్మిన త్రిలోక్ 5సార్లు ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ బిరుదు అందుకున్నారు.

అనుభవాలే ఉపాధ్యాయులన్న సూత్రాన్ని నమ్మిన ఆయన ఎవరి జీవితం నుంచి వారు పాఠాలు నేర్చుకోవాల్సిందే అనేవారు. కానీ, స్వీయానుభవాలు ఎన్ని ఉన్నా, సాహిత్యంతో అనుబంధం త్రిలోక్‌ను దర్శకుడిగా ప్రత్యేకంగా నిలిపిందన్నది నేటి సినీ తరం తెలుసుకోవాల్సిన పాఠం! 
- రెంటాల