యాసిడ్‌ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు

21 Oct, 2018 01:31 IST|Sakshi

‘‘ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు’’ అని గాయని చిన్మయి వాపోయారు. ప్రముఖ  గీత రచయిత వైరముత్తుపై కొందరు స్త్రీలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను చిన్మయి ట్వీటర్‌ ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే. చిన్మయి శనివారం చెన్నై పత్రికా సంఘం కార్యాలయంలో తమిళనాడు సినీ పరిశ్రమ పరిరక్షణ సమాఖ్య తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘లైంగిక వేధింపుల గురించి 2013లో నేను ట్వీటర్‌లో పేర్కొన్నప్పుడు బెదిరింపులు వచ్చాయి.

ఇప్పుడు కూడా నాపై యాసిడ్‌ పోస్తామంటూ హత్యా బెదిరింపులు వస్తున్నాయి. అదే విధంగా గత వారం రోజులుగా ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనను అప్పుడే బయటపెట్టకుండా ఇప్పుడెందుకు చెబుతున్నావని ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించి ఉండవచ్చు. అయితే మహిళల గొంతులు నొక్కే ప్రయత్నాలు కూడా ఆదే స్థాయిలో జరుగుతున్నాయి.

వైరముత్తుపై కేసు వేస్తాను. అందుకు ఆధారాలను రెడీ చేసుకుంటున్నా. సాధారణంగా ఇలాంటి లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు గాని, పోలీసులకు గాని చెబితే వాటిని నొక్కేసి, ఇంట్లో కూర్చోబెడతారు. మహిళల విషయంలో నాటి నుంచి జరుగుతున్నది ఇదే. మహిళా రక్షణకే మీటూ ఉద్యమం’’ అన్నారు. ఈ సమావేశంలో నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, లీనా మణిమేఘల, శ్రీరంజని తదితరులు పాల్గొన్నారు.

బెదిరిస్తున్నారు
కోలీవుడ్‌లో ‘మీటూ’ కలకలం రేపుతోంది. ఆరోపణలు, బెదిరింపులతో దద్దరిల్లుతోంది. నటుడు జాన్‌ విజయ్, సంగీత విద్వాంసుడు ఉమాశంకర్‌పైన బుల్లితెర యాంకర్‌ శ్రీరంజని లైంగిక వేధింపుల ఆరోపణలు చేశాను. ఒక ఇంటర్వ్యూ సందర్భంలో నటుడు జాన్‌ విజయ్‌ను కలిశాననీ, ఆ తరువాత ఒక రోజు అర్ధరాత్రి ఆయన తనకు ఫోన్‌ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారని ఆరోపించారు. దీని గురించి తెలిసి జాన్‌ విజయ్‌ భార్య తనకు ఫోన్‌ చేసి క్షమాపణ చెప్పారని శ్రీరంజని పేర్కొన్నారు.

జాన్‌ విజయ్‌ మాట్లాడుతూ – ‘‘మురుగు కాలువలో రాయి వేస్తే అది తిరిగి మనపైనే పడుతుంది. కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడటం వృథా’’ అన్నారు. కాగా సంగీత విద్వాంసుడు ఉమాశంకర్‌ తన గురించి చేసిన పోస్ట్‌ను తొలగించాలని బెదిరిస్తున్నారని శ్రీరంజని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా