8న కోలీవుడ్‌ ఆందోళన

4 Apr, 2018 10:10 IST|Sakshi

కావేరి బోర్డుకు మద్దతుగా, స్టెర్‌లైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా పోరుబాటకు కోలీవుడ్‌ కదిలింది. ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం వేదికగా దక్షిణ భారత నటీనటుల సంఘంతో పాటు చిత్ర పరిశ్రమ మొత్తం ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 9గంటల నుంచి, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సాగుతుంది. దీని గురించి దక్షిణ భారత నటీనటుల సంఘం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ తూత్తుక్కుడిలోని స్టెర్‌లైట్‌ కర్మాగారాన్ని మూసివేయాలని, అదే విధంగా కావేరి నది జలాల వ్యవహారంలో బోర్డును నియమించాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్‌ కోట్టం వద్ద ఆందోళన జరపనుందని పేర్కొన్నారు.

ఈ ఆందో ళనలో చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు ఈ నెల 4న స్టెర్‌లైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా, కావేరి బోర్డు ఏర్పాటుకు మద్దతుగా, అదే విధంగా చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నడిగర్‌సంఘం ప్రకటించింది. అయితే అందుకు ప్రభుత్వంనుంచి అనుమతి లభించలేదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కావేరి బోర్డు నియామకం కోసం ఆందోళన కార్యక్రమాలు జరుగుతుండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ప్రభుత్వం కోలీవుడ్‌ దీక్షకు అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ఆందోళన కార్యక్రమాన్ని ఈనెల 8న చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు