విశాల్‌తో ఢీకి భారతీరాజా రెడీ

30 Dec, 2018 06:58 IST|Sakshi

తమిళ నిర్మాతలమండలి ఎన్నికల్లో సీనియర్‌ దర్శకుడు భారతీరాజా, ప్రస్తుతం మండలి అధ్యక్షుడు విశాల్‌ను ఢీ కొనడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. విశాల్‌పై ఇటీవల ఆయన వ్యతిరేక వర్గం పలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిందే. అదేవిధంగా గత 18వ తేదీన విశాల్‌ వ్యతిరేక వర్గం మండలి కార్యాలయానికి తాళం వేసి చేసిన రచ్చ గురించి తెలిసిందే. విశాల్‌ మండలి అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేయాలని, వెంటనే మళ్లీ మండలి ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో పాటు ఆయనపై పలు ఆరోపణల చిట్టాతో భారతీరాజా నేతృత్వంలో వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు విశాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసే వరకూ పరిస్థితులను తీసుకొచ్చారు.

మార్చిలోనే ఎన్నికలు
మూడు ఏళ్లకొకసారి జరిగే నిర్మాతల మండలి ఎన్నికలు 2019 మార్చిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు నటుడు విశాల్‌ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గానికి నేతృత్వం వహిస్తున్న దర్శకుడు భారతీరాజానే అధ్యక్ష పదవికి పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చిన విశాల్‌ వ్యతిరేక వర్గం ఆ ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలెట్టింది.

అంతే కాదు పోటీ చేయాలని భారతీరాజాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. విశాల్‌తో ఢీ కొనడానికి భారతీరాజా సిద్ధంగానే ఉన్నట్లు, అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో నిర్మాతలు కొన్ని వర్గాలుగా విడిపోయినట్లు వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తే తాను విశాల్‌ను ఢీకొంటానని భారతీరాజా చెప్పినట్లు, ఆయన అనుకూల వర్గానికి చెందిన ఒకరు చెప్పారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఒక తమిళుడు ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికలే చాలా రసవత్తరంగాజరిగాయి. ఆ పోటీలో అందరి ఊహలను తలకిందులు చేస్తూ విశాల్‌ జట్టు విజయం సాధించింది.ఈ సారి కూడా గట్టి పోటీ నెలకొననుందన్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా మూడు నెలలు ఉందిగా!

మరిన్ని వార్తలు