పోలీస్‌ పవర్‌ చూపించే ఖాకి

13 Sep, 2017 00:33 IST|Sakshi
పోలీస్‌ పవర్‌ చూపించే ఖాకి

ఒంటిపై ఖాకీ చొక్కా... చేతిలో తుపాకీ... తప్పుడు పనులు చేసినోళ్లకు చుక్కలు చూపిస్తాడీ  ఖాకి’. సింపుల్‌గా పోలీసుల పవరేంటో? చూపిస్తాడంటున్నారు ‘ఆదిత్య మ్యూజిక్‌’ అధినేత ఉమేశ్‌ గుప్తా. కార్తీ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా  ‘ధీరన్‌ అధిగారమ్‌ ఒండ్రు’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఖాకి’గా తీసుకొస్తున్నారాయన. ద పవర్‌ అఫ్‌ పోలీస్‌... అనేది చిత్రఉపశీర్షిక. సంగీత ప్రపంచంలో 20 ఏళ్లుగా అగ్రగామిగా కొనసాగుతున్న ఆదిత్య మ్యూజిక్‌ ప్రై.లి. సంస్థ ఈ సినిమాతో చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ– ‘‘2005లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది.

ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కనిపిస్తారు. లుక్స్, ఫిజిక్‌ వైజ్‌గా జాగ్రత్తలు తీసుకుని చేశారు. కథ వినగానే తెలుగు ప్రేక్షకులకు చూపించాలని రైట్స్‌ తీసుకున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌ను, జిబ్రాన్‌ స్వరపరిచిన పాటల్ని, ఆ తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా, అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, కూర్పు: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.