విద్యార్థిని ఉసురు తీసిన నీట్‌ వివాదం

2 Sep, 2017 12:14 IST|Sakshi
విద్యార్థిని ఉసురు తీసిన నీట్‌ వివాదం

చెన్నై:  వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పై  తమిళనాడులో రగిలిన వివాదం ఓ  విద్యా కుసుమం  ఉసురు తీసింది. నీట్‌కు  వ్య‌తిరేకంగా పోరు మొదలు పెట్టిన దళిత  విద్యార్థిని అనూహ్యంగా తనువు చాలించింది.  త‌మిళ‌నాడుకు చెందిన ద‌ళిత విద్యార్థిని  ఎస్‌.అనిత (19) శుక్రవారం ఆత్మ‌హ‌త్య చేసుకుంది.  జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష్(నీట్) నుంచి తమళనాడు మినహాయించలేమని కేంద్ర స్పష్టం చేసిన వారంరోజులకు  ఆమె, తనకు ఇక మెడికల్‌ సీట్‌ రాదన్న ఆందోళనతో  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం  మరింత విషాదాన్నినింపింది.

సెందురై స‌మీపంలోని  కుజుమూర్ గ్రామానికి చెందిన అనిత రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు  పరీక్షల్లో అద్భుత ప్రతిభకనబర్చింది.  ఇంటర్‌లో ఆమెకు  1200 మార్కుల‌కు గాను 1176 మార్కులు వ‌చ్చాయి. మెడిసిన్ క‌ట్ ఆఫ్‌లో 196.75 మార్కులు వ‌చ్చాయి. అయితే నీట్ ప‌రీక్ష‌లో మాత్రం ఆమెకు కేవ‌లం 86 మార్కులే వ‌చ్చాయి. దీంతో ఆమె ఎంబీబీఎస్ సీటును పొంద‌లేక‌పోయింది. అయితే నీట్ ప‌రీక్ష‌ను ప్రామాణికంగా తీసుకోవద్దంటూ అనిత సుప్రీంలో కేసు వేసింది. త‌న‌కు డాక్ట‌ర్ కావాల‌ని ఉంద‌ని, ఇంట‌ర్ మార్కుల‌ను బేస్‌గా తీసుకుంటే త‌న‌కు మెడిక‌ల్ సీటు వ‌స్తుంద‌ని ఆమె త‌న అప్పీల్‌లో  వేడుకొంది. అయితే  నీట్‌పై నిరసన తెలుపుతూ తమిళనాడు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు  తిరస్కరించింది. నీట్‌ ఆధారంగానే మెడికల్‌ అడ్మిషన్స్‌ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

 తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు.  ఇది చాలా దురదృష్టకరమంటూ ఆమె మరణంపై సంతాపాన్ని వ్యక్తంచేశారు. అటు డీఎంకే నాయకుడు  ఎంకే స్టాలిన్‌  కూడా తీవ్ర దిగ్భ్రాంతిని   వ్యక్తంచేశారు.  నీట్‌ కారణంగా  అనిత కలలు ఆవిరైపోయాయని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ బేరసారాలతో ప్రభుత్వం నిరుపయోగంగా మారిందని దుయ్యబట్టారు.

మరోవైపు విద్యార్థుల ప్రయత్నం విఫలం కావడంతో నీట్‌ నుంచి తమిళనాడును మినహాయింపుకోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఇది  రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో వుంది.  అలాగే నీట్ వ‌ల్ల మెడిక‌ల్ సీట్లు పొంద‌లేక డిప్రెష‌న్‌లో ఉన్న విద్యార్థుల కోసం త‌మిళ‌నాడు రాష్ట్రం ప్ర‌త్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.